మొదలైన మెదక్, నందిగామ ఓట్ల లెక్కింపు..!

Posted On:15-09-2014
No.Of Views:363

తెలంగాణలోని మెదక్ లోకసభ స్థానంలోని సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం తొలి రౌండు ఓట్ల లెక్కింపు ముగిసింది. సంగారెడ్డి శాసనసభ సెగ్మెంట్ పరిధిలో  తెరాస అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. సంగారెడ్డి శాసనసభా నియోజకవర్గం నుంచి సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత బిజెపి లోకసభ అభ్యర్థి జగ్గారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.దుబ్బాక శాసనసభా నియోజకవర్గంలో తెరాస ఆధిక్యంలో ఉంది. పటాన్‌చెరు, సిద్ధిపేట శాసనసభా నియోజకవర్గాల్లో కూడా తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ లోకసభ స్థానంలో కారు దూసుకుపోంది. తెరాస అభ్యర్థి 46, 793 ఓట్ల మెజారిటీతో సాగుతోంది.  మెదక్ లోకసభ స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ తెరాస ముందంజలో ఉంది.

తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇప్పటి వరకు 73 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి 26 వేల పైచిలుకు ఓట్ల వచ్చాయి. బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనకు 18 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. మెదక్ లోకసభ స్థానంలో కొత్త ప్రభాకర్ రెడ్డి 60 వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో ముందంజలో ఉన్నారు. మెదక్ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో స్థానం కోసం బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డి, కాంగ్రెసు సునీతా లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. నందిగామలో టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్య 10 వేల పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు. ముూడో రౌండ్ ముగిసే సరికి ఆమె 15,010 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి సౌమ్య 19 వేల పైచిలుకు మెజారిటీతో ఉన్నారు. ఐదో రౌండ్ ముగిసే సరకి 25 వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఆరో రౌండు ముగిసే సరికి 32 వేల పైచిలుకు మెజారిటీతో ఉన్నారు. 8వ రౌండ్ ముగిసేసరికి సౌమ్య 44 వేల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తెలంగాణలోని మెదక్ లోకసభ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ శాసనసభా స్థానం ఓట్ల లెక్కింపు మంగళవారంనాడు ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నాం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మెదక్ లోకసభ స్థానం ఓట్ల లెక్కింపు పటాన్‌చెరు సమీపంలోని గీతం విశ్వవిద్యాలయంలో జరుగుతోంది. వంద రోజుల టిఆర్‌ఎస్ పాలనకు మెదక్ ఉప ఎన్నికలు రెఫరెండం లాంటివని మంత్రులు కల్వకుంట్ల తారక రామరావు, తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. టిఆర్‌ఎస్ తరఫున హరీశ్‌రావు ఎన్నికల బాధ్యతలు స్వీకరించారు. సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మూడు లక్షల 90వేల ఓట్ల మెజారిటీ వచ్చింది.

77శాతం పోలింగ్ జరిగినప్పుడు ఆ మేరకు మెజారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు 65 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికల్లో 11 శాతం మేరకు పోలింగ్ తగ్గింది. దీంతో మెజారిటీ ఎంత వస్తుందనే దానిపై అన్ని పార్టీల్లో ఉత్కంఠత నెలకొంది. మెదక్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ శెమూషి బాజ్‌పాయ్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తుకు ఇద్దరు అదనపు ఎస్పీలు, ఇద్దరు డిఎస్పీలు, 18మంది సిఐలు, 33మంది ఎస్‌ఐలు, 80మంది ఎఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 270మంది కానిస్టేబుళ్లు, 10మంది మహిళా హెడ్‌కానిస్టేబుళ్లు, 90మంది హోంగార్డులను నియమించారు. నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం స్థానిక కెవిఆర్ కళాశాల మీటింగ్ హాలులో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి రజనీకాంతారావు సోమవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.