మెట్రో రైలుపై చేతులెత్తేసిన ఎల్ అండ్ టీ..!

Posted On:17-09-2014
No.Of Views:330

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు హైదరాబాదు మెట్రో రైలు విషయంలో ఎల్ అండ్ టీ షాక్ ఇచ్చింది. మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తాము తప్పుకుంటామని తేల్చిచెప్పింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మీరే నిర్వహించుకోండని కూడా చెప్పింది. ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీబీ గాడ్గిల్‌ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి ఈ మేరకు ఓ లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ఒప్పందం, ఆ తరువాత తలెత్తిన పరిణామాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి రాసిన పలు లేఖల గురించి ప్రస్తావించారు. మారిన రాజకీయ, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో మెట్రో రైలు మనుగడ అనుమానంగానే ఉందని గాడ్గిల్ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.

ఇంత భారీ ప్రాజెక్టును కేవలం ప్రయాణికులకు టికెట్లు విక్రయించి నిర్వహించలేమని చెప్పేసింది. రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. రాష్ట్రం విడిపోయిందని, హైదరాబాద్‌ నగరానికి ఇంతకుముందు ఉన్నన్ని అవకాశాలు ఇప్పుడు లేవని తెలిపారు. తాము ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారాలు చూపించాల్సింది పోయి తమపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారని గాడ్గిల్ ఆవేదన వ్యక్తం చేశారు. తమవైపు నుంచి ఎలాంటి దురుద్దేశాలు లేకుండా ఈ లేఖ రాస్తున్నామని, దీనిపై చర్చలకు తాము సిద్ధమేనని, అందరం కలిసి కూర్చుని, చర్చించుకుని, ఓ సామరస్యపూర్వకమైన పరిష్కారానికి వద్దామని గాడ్గిల్‌ అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తారని, హైదరాబాద్‌ స్థాయి మారుతుందని తాము ఊహించలేదని గాడ్గిల్‌ అన్నారు.

ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరిగినా అప్పట్లో ఏమీ జరగలేదని అన్నారు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కుదిరిన తర్వాత 2010 డిసెంబర్‌ 30వ తేదీన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించిందని, కమిటీ ఆరు పరిష్కార మార్గాలు సూచించిందని, వాటిలో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్నది కూడా ఒకటని, ఒకవేళ రాష్ట్రం విడిపోయినా... హైదరాబాద్‌కు కేంద్రపాలిత ప్రాంతం హోదా కల్పించి, దీన్ని ఉమ్మడి రాజధాని చేస్తారని అప్పట్లో అందరూ అన్నారని, అందువల్ల రాష్ట్రం విడిపోయినా ప్రాజెక్టుకు ఇబ్బంది ఉండదని, హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని భావించే ఈ బిడ్‌కు తమ సంస్థ ముందుకొచ్చిందని గాడ్గిల్‌ తెలిపారు. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకునే తాము మెట్రో ప్రాజెక్టు చేపట్టామని గాడ్గిల్‌ చెప్పారు. కానీ విభజన జరిగిపోయిందని, హైదరాబాద్‌ ప్రాధాన్యం తగ్గిందని తెలిపారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ఉన్న అవకాశాలు, హైదరాబాద్‌ నగరానికి ఉన్న ప్రాధాన్యం, దీని ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ప్రాధాన్యాలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మేం మెట్రో రైలు ప్రాజెక్టుకు బిడ్‌ వేశామని, హైదరాబాద్‌ నగరానికి అంతకుముందున్న స్థాయిలోనే ప్రాధాన్యం ఉంటే ప్రాజెక్టు మనుగడ కూడా బాగుండేదని, ఎందుకంటే, ప్రాజెక్టు ఆదాయ మార్గాల్లో రియల్‌ ఎస్టేట్‌ కూడా చాలా ప్రధాన భూమిక పోషిస్తుందని, కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రాజెక్టు మనుగడ సాధించడం సాధ్యం కాదని ఇంతకుముందు కూడా తాము పలు సందర్భాలలో చెప్పాం. ఈ ప్రాజెక్టు కేవలం రైలు రవాణా వ్యవస్థ మాత్రమే కాదు... పలు అంశాల సమాహారమని గాడ్గిల్‌ తన లేఖలో తెలిపారు.

ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ అందించడం మెట్రో రైలు ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి అయినప్పటికీ ఈ ప్రాజెక్టు మనుగడకు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కూడా ప్రధాన అంశమని గాడ్గిల్‌ తెలిపారు. మెట్రో రైల్‌కు బిడ్‌లు పిలిచే సమయంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించిందని, రవాణా ఆధారిత కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధిని కూడా ప్రాజెక్టులో ఓ అంశంగా పేర్కొన్నారని, రైలు టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ ద్వారా వచ్చే ఆదాయం వల్లనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో మనుగడ సాధించగలదని తెలిపారు. విభజన తర్వాత హైదరాబాద్‌లో అవకాశాలు తగ్గినట్లేనని గాడ్గిల్‌ తన లేఖలో అన్నారు.

విభజనకు ముందు హైదరాబాద్‌ మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రాజధాని అని, సమైక్య రాష్ట్రం అనేక జిల్లాలు, ఓడరేవులకు నిలయమని, ఇప్పుడు హైదరాబాద్‌ వనరులు అంతగా లేని చిన్న రాష్ట్రానికి రాజధాని అని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తుందని, అక్కడ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కావల్సిన ఆర్థిక సాయం అందజేస్తుందని గాడ్గిల్ అన్నారు. దానికితోడు పార్లమెంటులో తెలంగాణ ఎంపీల బలం కూడా తగ్గుతుందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేటురంగం నుంచిగానీ పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్‌ స్థాయి మారిపోయిందని ఆయన అన్నారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతిపాదించినప్పటి నుంచే మెట్రో ప్రాజెక్టు మనుగడపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని గాడ్గిల్‌ తెలిపారు. రాష్ట్ర విభజన ప్రభావం ఈ ప్రాజెక్టుపై ఎలా పడుతుందో ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన రాసిన లేఖలో కూడా వివరించామని, స్వల్పకాలిక దృష్టితో ఆలోచించవద్దని, దీర్ఘకాల ప్రయోజనాలు చూసుకోవాలని మీరు పేర్కొన్నారని, అయితే, దీర్ఘకాలంలో కూడా మెట్రోపై విభజన ప్రభావం ఉండదనే నమ్మకం లేదని గాడ్గిల్‌ తెలిపారు. తగిన తేదీ నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా చర్చలకు రావాలని గాడ్గిల్ ఎన్వీఎస్‌ రెడ్డిని కోరారు. తాము ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే ఈ ప్రతిపాదన చేస్తున్నామని తెలిపారు.