రూ.200 కోసం వెళితే 26 లక్షలు వచ్చేశాయి

Posted On:20-09-2014
No.Of Views:347

హైదరాబాద్ :  రెండు వందల రూపాయిల కోసం వెళ్లిన ఓ విద్యార్థి వందలు, వేలు కాదు... ఏకంగా 26 లక్షలు కళ్ల చూశాడు. డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు తన స్నేహితుడితో వెళ్లిన లతీఫ్ అనే విద్యార్థికి ఈ సంఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే ఎస్ఆర్ నగర్కు చెందిన లతీఫ్ స్థానికంగా ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎంకు డబ్బులు తీసుకునేందుకు వెళ్లాడు. అయితే అంతకు ముందే ఏటీఎం మిషన్లో డబ్బు పెట్టిన అధికారులు లాక్ వేయకుండా వెళ్లిపోయారు.  

కాగా లతీఫ్ డబ్బు తీసుకుంటూ ఉండగా మిషన్ డోర్ తెరుచుకుని డబ్బు కిందపడింది. దాంతో అతను జరిగిన విషయాన్ని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. అయితే బ్యాంక్ అధికారులు తమ పరిధిలోకి రాదని చెప్పటంతో....  లతీఫ్ ఈ విషయాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులకు తెలిపాడు.  అక్కడకు చేరుకుని పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. సిబ్బంది లాక్ , సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. బ్యాంక్ సిబ్బందిని పిలిచి విచారణ జరిపారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుతో పాటు సీసీ కెమెరాలు కూడా లేనట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విద్యార్థి నిజాయితీ.... 26 లక్షలును కాపాడింది.