పవన్ కళ్యాణ్‌ ఒక మేకప్, ప్యాకప్ గయ్‌ : కవిత..!

Posted On:24-09-2014
No.Of Views:395

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సెటైర్లు విసిరారు. పవన్ కళ్యాణ్‌ను ఆమె మేకప్, ప్యాకప్ గయ్‌గా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ కొంచెం మేకప్‌తో ఎన్నికలకు ముందు వస్తారని, తన వంతు నటన చేసేసి వెళ్లిపోతారని, కానీ తమ విషయం అలా కాదని, తాము ప్రజలతో ఉంటామని ఆమె అన్నారు.

కల్వకుంట్ల కవిత ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ రిపోర్టింగ్, ఎడిటోరియల్ స్టాఫ్‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దక్కన్ క్రానికల్ కార్యాలయంలో గంటన్నర సేపు ఆమె ఉన్నారు. ఏదీ, పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపిస్తున్నారా అని ఆమె సూటిగా, తనదైన శైలిలో అడిగారు. మాటకారితనంతో అందరినీ ఆకట్టుకునే కవిత, అది తనకు వారసత్వం నుంచి వచ్చింది కాదని, ఏళ్ల తరబడి చేసిన కఠినమైన శ్రమతో అలవరుచుకుందని చెప్పారు. స్థానికత క్లాజ్‌ను ఆమె సమర్థించారు. అది తమ ప్రజలకు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో వివిధ చట్టాలు ఉన్నాయని ఆమె అన్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదని, చార్మినార్, గోల్కొండ అని ఆమె అన్నారు.