చత్తీస్ ఘడ్ లో మావోల ఘాతుకం

Posted On:01-12-2014
No.Of Views:352

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై సోమవారం మెరుపుదాడి చేశారు. ఈ నెల 2 నుంచి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో వారి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసులు దక్షిణ బస్తర్‌ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌కే చెందిన కోబ్రా బెటాలియన్‌, జిల్లా బలగాలతో కూడిన సంయుక్త దళం సోమవారం సాయంత్రం గాలింపు నిర్వహించి చింతగుఫాలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపునకు తిరిగి వస్తుండగా కాసులపాడు గ్రామ అటవీప్రాంతంలో సాయుధులైన మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మాటువేసి ఒక్కసారిగా విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వారోత్సవాలు విజయవంతం చేసేందుకే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు.. స్థానికులను అడ్డుపెట్టుకోవడంతో జవాన్లు దూకుడుగా ఎదురుకాల్పులు జరపలేకపోయారని, జాగ్రత్తగా కాల్పులు జరపాల్సి వచ్చిందని ఒక అధికారి చెప్పారు. 8 మంది నక్సలైట్లు తీవ్రంగా గాయపడడమో, మరణించి ఉండడమో జరిగి ఉండవచ్చని ఆయన చెప్పారు.జవాన్ల మృతదేహాలను, గాయపడ్డ జవాన్లను తరలించే పరిస్థితి లేకుండాపోయింది. దాడి జరిగింది సాయంత్రం సమయం కావడం, ఆ ప్రాంతం.. సీఆర్‌పీఎఫ్‌ క్యాంపునకు ఏడు నుంచి పది కి.మీల దూరం ఉండటంతో సంఘటన స్థలానికి పోలీసు బలగాలు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. హెలికాప్టర్‌ను తీసుకువెళ్లాలన్నా, జగదల్‌పూర్‌లో హెలికాప్టర్‌ అందుబాటులో లేకపోయింది. ఈ దాడితో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు రాష్గాల్లోని పోలీసులను కేంద్రం అప్రమత్తం చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ ఆసిఫ్‌ ఇబ్రహీం, సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఛత్తీస్‌గఢ్‌కు మంగళవారం వెళ్లనున్నట్లు తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పట్టుకోసం ప్రయత్నం: మావోయిస్టులు కొంతకాలంగా ఈ ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దండకారణ్యాన్ని అడ్డాగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత నెల 21న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఆరుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను గాయపర్చారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) హెలికాప్టర్‌పై దాడి చేసి ఐఏఎఫ్‌ కమాండోనూ గాయపర్చారు. ఖమ్మం జిల్లా సరిహద్దులోని వెంకటాపురం, చింతూరు, చర్ల, వాజేడు, వీఆర్‌పురం, కూనవరం మండలాలతోపాటు పలు ప్రాంతాల్లో గోడప్రతులు అతికించారు. ప్రజాప్రతినిధులు, నేతలను హెచ్చరించారు. మావోయిస్టుల కార్యకలాపాలను తిప్పికొట్టేందుకు సుకుమా జిల్లా కిష్టారం వద్ద సీఆర్‌సీఎఫ్‌ క్యాంపును నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. దీనికోసం ఇసుక తరలిస్తున్న లారీని దుమ్ముగూడెం మండలం పైడిగూడెం సమీపంలో దహనం చేశారు. ఈ ఏడాదిలోనే నలుగురిని ఇన్‌ఫార్మర్ల పేరుతో హతమార్చారు.సోమవారం మావోయిస్టులు సృష్టించిన మారణకాండ పథకం ప్రకారమే చేశారని సమాచారం. మంగళవారం నుంచి అమరవీరుల వారోత్సవాలు నిర్వహణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రత దళాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఇందులో భాగంగా సుకుమా జిల్లా చింతగుఫా వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలతో కలిసిపోయిన మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. తిరిగి దాడి చేసేలోపు 13మంది జవాన్ల ఉసురు తీసేశారు. గతంలో కాంగ్రెస్‌ నేత మహేంద్రకర్మ, శ్యాం చరణ్‌ శుక్లాపై ఇదే విధంగా దాడి జరిగింది. ఆ దాడి తర్వాత ఇదే అది పెద్ద దాడి అని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా చింతగుఫా వద్ద సోమవారం మావోయిస్టులు చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.