హరికృష్ణ తనయుడు జానకిరామ్‌ దుర్మరణం

Posted On:06-12-2014
No.Of Views:319

తెదేపా సీనియర్‌ నేత, సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం 6.20 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. జానకిరామ్‌ తన సఫారీ కారు (ఏపీ29 బీడీ 2323)లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఆయనే స్వయంగా వాహనాన్ని నడుపుతూ జాతీయ రహదారిపై వెళుతున్నారు. కోదాడ సమీపంలోని ఆకుపాముల వద్ద వరి నారు లోడుతో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ట్రాక్టర్‌ తప్పు దారిలో (రాంగ్‌ రూట్‌)లో వస్తుండటం, జానకిరామ్‌ కారు వేగంగా ఉండటంతో ప్రమాదం సంభవించింది. కారు ట్రాక్టర్‌ట్రాలీ కిందకు దూసుకెళ్లటంతో నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జానకిరామ్‌ను స్థానికులు కోదాడలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తలకు, వెన్నెముకకు తీవ్రగాయాలై రక్తస్రావం కావటంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా జానకిరామ్‌ను కాపాడలేకపోయారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.
ప్రమాదం జరిగిన కోదాడ ప్రాంతం హైదరాబాద్‌కు 175 కిలోమీటర్లు, విజయవాడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జానకిరామ్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందేసరికే రాత్రి ఏడు గంటలు దాటడంతో కోదాడకు రావటం కూడా కష్టంగా మారింది. దీంతో రాత్రి 8గంటల వరకు జానకిరామ్‌ మృతదేహం వద్ద ఎవరూ లేరు. మృతదేహానికి పోస్టుమార్టం ఎక్కడ నిర్వహించాలనే విషయంపై గంటపాటు తర్జనభర్జన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ నల్గొండ జిల్లా కలెక్టర్‌ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావులతో ఫోన్‌లో మాట్లాడారు. రాత్రివేళ కావటంతో మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించాలని కోరారు. దీనికి కలెక్టర్‌, ఎస్పీలు అంగీకరించారు. రాత్రి 8 గంటలకు పోలీసులే ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
జనసంద్రమైన కోదాడ 
జానకిరామ్‌ మరణవార్త తెలియగానే కోదాడ, పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఆస్పత్రికి తరలివచ్చారు. జానకిరామ్‌ హరికృష్ణ తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేనల్లుడు కావటం, సినీ, రాజకీయం నేపథ్యమున్న కుటుంబం కావటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసేందుకు వారంతా ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని పంపించేశారు.