పాత్రికేయ దిగ్గజం పిరాట్ల కన్నుమూత

Posted On:08-12-2014
No.Of Views:354

 పాత్రికేయ దిగ్గజం, ‘కృష్ణాపత్రిక’ సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు (74) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇరవై రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నారాయణగూడలోని ఒక ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా... చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమారుడు కృష్ణకిషోర్‌ ఉన్నారు. పిరాట్ల భౌతికకాయాన్ని శేరిలింగంపల్లిలోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. మంగళవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.ముట్నూరు కృష్ణారావు స్థాపించిన కృష్ణాపత్రికను 1983 నుంచి పిరాట్ల నిర్విరామంగా కొనసాగిస్తూ వచ్చారు. సంపాదకీయాల ద్వారా ఆయన గుర్తింపు పొందారు. నక్సలైట్ల సమస్యపై సదస్సులు నిర్వహించారు. మావోయిస్టులపై అనేక పుస్తకాలు రాశారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి విప్లవాత్మకంగా కృషిచేసిన జయప్రకాశ్‌ నారాయణ్‌కు వ్యక్తిగత సహాయకులుగానూ పనిచేశారు. తొలినాళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా, తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)కు జాతీయ స్థాయిలో సేవలు అందించారు. ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలో గడిపారు. తర్వాత భాజపాలో చేరారు. కృష్ణాపత్రిక వంద సంవత్సరాల ఉత్సవాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయీ నివాసంలో పీవీ నరసింహారావు వంటి ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.