అంతా గ్యాసే!

Posted On:08-12-2014
No.Of Views:409

పాతిక అడుగుల పొడవు.200 కేజీల బరువు.భీతిగొలిపేలా ఉన్న అనకొండకు ఓ యాభై కేజీల 27 ఏళ్ల కుర్రాడు దొరికితే గుటుక్కున మింగేయదూ. విషయం మీకు అర్థమైనట్లే ఉంది. న్యూజెర్సీకి చెందిన పాల్‌ రోనాలీ అనే సాహసికుడు అనకొండ కడుపులోకి వెళ్లి,గంట గడిపి మళ్లీ తిరిగి వచ్చేయాలని చాలాకాలం నుంచి కలలు కనేవాడు. దీన్ని నిజం చేసుకునేందుకు అమెజాన్‌ దట్టమైన అడవుల్లోకి వెళ్లి, అనకొండల్లో తనకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని, దానికి ఆహారమయ్యాడట.కడుపులో  ఓ గంట గడిపి, తాపీగా తనవాళ్లతో మొబైల్‌లో మాట్లాడిన తర్వాత, బయటికి తిరిగి వచ్చాడట. ఇదీ డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కాబోయే కథనం. దీన్ని మనం నమ్మి తీరాలా? కడుపులోకి వెళ్లిన వ్యక్తి అనకొండకు ఎలాంటి నష్టం చేయకుండా ఎలా ఉంటాడు. అంటే బయటికి వచ్చేటప్పుడు కడుపును చీల్చుకురావాల్సిందే. అంటే తన సాహస కృత్యం  కోసం అనకొండను చంపేశాడన్న మాట. అందుకే పెటా వాళ్లు, జంతు సంరక్షణ సంఘాలు అసలు అనకొండను చూపించమని గొడవ చేస్తున్నారు. అసలు వీడియోను చూస్తుంటే ఇదేదో ఏర్పాటు చేసినట్లే కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూడండి. అడవుల్లో మనుషులు కనిపించడమే అరుదు. అలాంటిది కనిపిస్తే ఇంత పెద్ద అనకొండ(నిజంగా ఉంటే) గటుక్కున మింగేయదూ..మన పాల్‌గారు దానితో ఆటలాడేంత వరకూ ఊరుకుంటుందేమిటి?