జయలలితకు సుప్రీంలో షాక్

Posted On:11-12-2014
No.Of Views:290

 న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గురువారం అత్యున్నత న్యాయస్థాన సుప్రీం కోర్టులో చుక్కెదరైంది. ఆదాయపన్ను కేసులో జయలలిత దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో తనకు విధించిన శిక్ష పైన ముందుగా విచారించాలంటూ జయ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్న జయలలితకు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బెంగళూరు ట్రయల్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. పిటిషన్ వేసిన జయ.. కేసులో ముందుగానే విచారణ ఎందుకు చేపట్టాలో మాత్రం చెప్పలేదు. కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టైన జయ తర్వాత బెయిల్ పైన విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ఆమె జైలు నుండి విడుదలయ్యాక స్పందించారు. ఆమె తన ప్రజాజీవితాన్ని నిప్పుల నదిలో ఈదడంతో పోల్చారు. ఇలాంటి కష్టాలు ఎదుర్కొనక తప్పదన్న విషయం తనకు తెలుసని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాను ఎంచుకున్న మార్గంలో కష్టాలు ఎదుర్కొనాల్సి రావడంపై తాను బాధపడడం లేదని ఆ ప్రకటనలో తెలిపారు. జైలు నుండి విడుదలయ్యాక జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ లేఖ కూడా రాశారు. ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ లేఖలో జయకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జయ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి మేనకా గాంధీ కూడా జయకు లేఖ రాశారు. కష్టాలు తొలిగి, మళ్లీ సీఎం పీఠంపై కూర్చోవాలని లేఖలో ఆకాంక్షించారు. రజనీ లేఖ పైన జయ స్పందించారు కూడా. తనకు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాసిన రజనీకాంత్, మేనకా గాంధీలకు జయలలిత ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించడం తనను కదిలించిందని, మీ ఉత్తరం తన మనసు లోతులను తాకిందని జయ.. మేనకా గాంధీ లేఖ పైన స్పందించారు. మీ ఉత్తరం చూసి ఎంతో సంతోషించానని, మీరు వ్యక్తం చేసిన సానభూతికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని, మీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు అని జయ.. రజనీకి ప్రత్యుత్తరం రాశారు. జయ అరెస్టు, విడుదల పైన డీఎంకే అధ్యక్షులు కరుణానిధి కూడాస్పందించారు. జయలలిత జైలు నుండి విడుదల కావడంపై డీఎంకే అధ్యక్షులు కరుణానిధి నాడు స్పందించారు. జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తాను సంతోషించలేదని, అలాగే ఇప్పుడు విడుదలై బయటకు వస్తే బాధపడలేదని చెప్పారు.