ఉద్యోగానికి గూగుల్ బెస్ట్!

Posted On:11-12-2014
No.Of Views:326

వాషింగ్టన్: ఉద్యోగానికి ఉత్తమమైన టాప్ 50 కంపెనీల్లో ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది రెండో స్థానంలో నిల్చిన మైక్రో బ్లాగింగ్ సైటు ట్విట్టర్‌కి ఈసారి జాబితాలో అసలు చోటే దక్కలేదు. 2015కి సంబంధించి అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఉద్యోగానికి ఉత్తమమైన 50 కంపెనీలపై అమెరికన్ వెబ్‌సైట్ గ్లాస్‌డోర్ ఈ లిస్టును రూపొందించింది. ఇటు ఉద్యోగం, అటు కుటుంబ బాధ్యతలకు మధ్య సమతౌల్యం పాటించేందుకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నందున గూగుల్ టాప్‌లో నిల్చింది.ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా ఈ జాబితాను గ్లాస్‌డోర్ రూపొందించింది. రెండో స్థానంలో కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ రెండో ప్లేస్‌లో, మూడో స్థానంలో నెస్లే ప్యురినా పెట్‌కేర్ ఉన్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ లింక్డ్‌ఇన్ మూడో స్థానం నుంచి 23వ స్థానానికి, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ అయిదో స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయాయి. గతేడాది టెక్నాలజీ లిస్టులో అగ్రస్థానంలోనూ, ఓవరాల్‌గా రెండో ఉత్తమ కంపెనీగాను నిల్చిన ట్విటర్ ఈసారి అసలు చోటు దక్కకపోవడం విశేషం.