నయా నగర్‌గా హైదరాబాద్‌

Posted On:11-12-2014
No.Of Views:358

చారిత్రక ఆనవాళ్లు చెరిగిపోకుండానే... హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలోనే అగ్రశ్రేణి నగరంగా, ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ విషయంలో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో  ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ బృందంతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. తన ఆకాంక్షల మేరకు హైదరాబాద్‌లో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించారు. కొత్త కట్టడాల నిర్మాణం కోసం మ్యాప్‌లు, గూగుల్‌ ఎర్త్‌ చిత్రాలను పరిశీలించారు. మూసీ చుట్టు పక్కల ప్రాంతాల్లో చేపట్టాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ బృందానికి పలు సూచనలు చేశారు. ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో (ఎన్టీఆర్‌ స్టేడియం?) ‘తెలంగాణ కళా భారతి’ పేరుతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని కేసీఆర్‌ ఆదేశించారు. నాలుగు ఆడిటోరియంలు, విశాలమైన పార్కింగ్‌ ఏరియా ఉండేలా నమూనా తయారు చేయాలన్నారు. ఒక ఆడిటోరియంలో 2000-3000 మంది, మరో దానిలో 1500, మూడో ఆడిటోరియంలో 1000 మంది, నాలుగవ దానిలో 600 మంది పట్టేలా డిజైన్‌ చేయాలని సూచించారు. ప్రస్తుతం రవీంద్ర భారతి ఉన్న ప్రాంతంలో హైదరాబాద్‌ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను చాటేలా ఒక ప్రత్యేక కట్టడం రావాలని సీఎం చెప్పారు. మొజాంజాహి మార్కెట్‌, చార్మినార్‌ ప్రాంతం, హుస్సేన్‌సాగర్‌ చుట్టు ప్రక్కల, సాలార్‌జంగ్‌ మ్యూజియం ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు వన్నె తెచ్చేలా ఆవరణలు తయారు చేయాలన్నారు. వాటి ప్రాముఖ్యత ఏ మాత్రం దెబ్బతినకుండా, వాటికి అనుబంధంగా మరిన్ని నిర్మాణాలు రావాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. మూసీకి రెండు వైపులా అద్భుతమైన పార్కులు, పార్కింగ్‌ ప్లేస్‌లు రావాలన్నారు. మూసీ, ఈసీ నదుల ప్రాంతాన్ని చాదర్‌ఘాట్‌ నుంచి లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ దాకా సర్వే చేసి అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉందో తేల్చాలని ఆదేశించారు. ఆ తర్వాత మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పనుల కోసం ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంను అంతర్జాతీయ స్థాయి మ్యూజియంగా తీర్చి దిద్దాలని ఆదేవించారు.