చుక్కలు చూపిన చంద్రకళ

Posted On:19-12-2014
No.Of Views:395

 యూపీలోని బులంద్ షహర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ అంటేనే ఠారెత్తుతున్నారు. 35 ఏళ్ళ ఈ తెలంగాణ ఐఎఎస్ అధికారి కరీంనగర్ అమ్మాయే. మధుర నుంచి బులంద్ షహర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఈమె..అక్కడ ప్రజా పనుల్లో జరుగుతున్న  అవినీతిమీద మండిపడ్డారు. రహదారి పనుల్లో నాసిరకం ఇటుకలు, టైల్స్ వాడినట్టు గుర్తించిన చంద్రకళ అక్కడి అధికారులను, కాంట్రాక్టర్లను ఏకి పారేశారు. స్కూలు పిల్లల్లా వరుసగా నిలబెట్టి వాళ్ళమీద అందరిముందే చిందులేశారు.
చుప్..చుప్..ఇంకేం మాట్లాడొద్దు..మీరు చేసే పని ఇదేనా..మీరు జైలుకు వెళ్ళడం ఖాయం..మీలో కాస్తైనా నైతికత ఉందా..?మీరు సిగ్గుతో తలదించుకోవాలి అంటూ నోరెత్తకుండా చేశారు. చంద్రకళ ధాటికి అధికారులు, కాంట్రాక్టర్లు పిల్లుల్లా అయిపోయి నోరెత్తితే ఒట్టు. మొత్తం 17 కాంట్రాక్టుల్ని ఈమె రద్దు చేశారు. ఈ లేడీ సింఘం వివరాల్లోకి వెళ్తే..గిరిజన తెగకు చెందిన బుఖ్యా చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా రామగుండం. హైదరాబాద్ లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు.. 2008 లో సివిల్స్ లో 409వ ర్యాంకు సాధించారు.. చంద్రకళ భర్త శ్రీరాములు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో డీఈఈగా పనిచేస్తున్నారని, వీరికి తొమ్మిదేళ్ళ కుమార్తె ఉందని తెలిసింది.  బులంద్ షహర్ లో అవినీతి అధికారుల మీద అపర కాళికలా ధ్వజమెత్తిన చంద్రకళ తాలూకు వీడియోని ఆరు లక్షలమంది  చూశారు. మూడువేల కామెంట్లు, ఇరవైఏడు వేలకు పైగా షేర్లు వచ్చి పడ్డాయి.