ప్రపంచమంతటా ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు

Posted On:31-12-2014
No.Of Views:306

హ్యాపీ న్యూ ఇయర్‌.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నయాసాల్‌ ముబారక్‌! రాత్రి 12 నుంచి ఎవరి నోట విన్నా ఇవే మాటలు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సమోవాలో తొలి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆపై న్యూజిలాండ్‌, ఆసే్ట్రలియా, జపాన్‌, చైనా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భారత్‌, శ్రీలంక దేశాలు 2015లోకి అడుగుపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నూతన సంవత్సర వేడుకల సందడి కనిపించింది. మనకు గురువారం తెల్లవారేసరికి.. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు ఇంకా కొత్త ఏడాది కోసం వేచి చూస్తున్నాయి.  హ్యాపీ న్యూ ఇయర్‌.. 2015 వచ్చేసింది! ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కొత్త సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకొన్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అయితే, మనకన్నా ముందే ప్రపంచంలో చాలా దేశాల్లో కొత్త ఏడాది వచ్చేసింది. టైమ్‌జోన్ల మహిమ ఇది. ఉదాహరణఖు.. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు.. సమోవాలో కొత్త ఏడాది తొలి వేడుకలు మొదలయ్యాయి. టైమ్‌ జోన్లలో మార్పు కారణంగా అక్కడ ఆ సమయానికి అర్ధరాత్రి అయింది మరి. ఆ తర్వాత.. క్రిస్‌మస్‌ ఐలండ్‌, కిరిబాటీల్లో వేడుకలు నిర్వహించారు. టైమ్‌ జోన్లో వాటి తర్వాత వచ్చే న్యూజిలాండ్‌లో.. ప్రజలు నగర కూడళ్లలో చేరి బాణసంచాతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆక్లాండ్‌లో స్కైటవర్‌పై ఉన్న గడియారం 12 గంటలు కొట్టగానే టవర్‌పై నుంచి టపాసుల మోత మొదలైంది. ఇక.. ఆసే్ట్రలియాలో ఎప్పటిలాగానే సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి కొత్త ఏడాది వేడుకలకు కేంద్రబిందువైంది. అర్ధరాత్రి ఆకాశంలో హరివిల్లు విరిసిందా అన్నట్టు బ్రిడ్జి వద్ద బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. ఈ వేడుకలను దాదాపు 15 లక్షల మంది తిలకించారని అంచనా. అలాగే, ఈ బాణసంచా జిలుగులను చిత్రీకరించేందకు తొలిసారిగా డ్రోన్‌లను వినియోగించారు. ఆ తర్వాత.. వరుసగా జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భారత్‌, శ్రీలంక దేశాలు 2015లోకి అడుగుపెట్టాయి. మన తర్వాత పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, అజర్‌బైజాన్‌, ఇరాన్‌, రష్యా, గ్రీస్‌, జర్మనీ, ఇంగ్లండ్‌ తదితర దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. బెంగళూరులో ఇటీవలే బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల పర్యవేక్షణకు డ్రోన్‌ కెమెరాలను వినియోగించారు. ఇవి 150 నుంచి 200 అడుగుల ఎత్తు నుంచి విహంగవీక్షణం చేస్తూండగా అధికారులు కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పరిస్థితిని సమీక్షించారు.