గవర్నర్ ఇస్థే చాలు..కిరణ్-డిమాండ్లు వద్దు:అమిత్ షా

Posted On:01-01-2015
No.Of Views:357

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. కిరణ్ రెడ్డి బీజేపీలో చేరే కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత రెండు రోజులుగా బీజేపీలో చేరే విషయమై కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా, బేషరతుగానే బీజేపీలో చేరాలని అమిత్ షా మెలిక పెట్టారని వార్తలు వస్తున్నాయి. కిరణ్ జనవరి 29న కాషాయ కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనవరి 29వ తేదీన బెజవాడలో ఆయన పార్టీలో చేరవచ్చునని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ఏపీకి దాదాపు నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆ పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌లో ఉంటూనే తనను తాను సమైక్య సింహంగా ప్రకటించుకున్నారు. రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకుంటానని చెప్పారు. అయితే, చివరకు కేంద్రం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తుందని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల పోటీ చేశారు. తన పార్టీ తరఫున ప్రచారం చేయాల్సి రావడంతో ఆయన అప్పుడు పోటీ చేయలేదు. ఆయన ప్రాతినిథ్యం వహించిన పీలేరు నుండి తన తమ్ముడిని బరిలోకి దింపారు. అక్కడ మాత్రమే ఆ పార్టీ డిపాజిట్ దక్కించుకుంది.