నిజాంను స్మరించుకుంటే తప్పేంటి: కెసిఆర్

Posted On:01-01-2015
No.Of Views:344

 హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ (అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన- 2015)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్, హోంశాఖ మంత్రి డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీనాయిని నర్సింహరెడ్డి, , ఎంపి కె కేశవరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నుమాయిష్ ప్లాటినం జూబ్లీ సావనీర్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిజాం గొప్ప ప్రభువని, అయితే ఆయన కొన్ని విషయాల్లో తప్పులు చేశారని అన్నారు. తెల్లదొర కాటన్‌ను స్మరించుకుంటున్నారని, నిజాంను స్మరించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు నిజాం నిర్మించినవేనన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్నా అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వం తరపున భూమిని కేటాయిస్తామని కెసిఆర్ అన్నారు. హైదరాబాద్‌లో భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉందని అన్నారు. 15ఏళ్ల కిందటే హైదరాబాద్ గ్రిడ్ లాక్ అయిందని, పైవంతెనలు కూడా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం లేదన్నారు. డల్లాస్‌లో మాదిరి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని కెసిఆర్ చెప్పారు. ఈసారి సుమారు 20 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించనున్నట్లు అంచనా వేస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి నరోత్తం రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్‌లో సుమారు 2500 స్టాళ్లను ఏర్పాటు చేశారు. కాగా, జనవరి 1న ప్రారంభమైన ఈ నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుంది. ఈ ఏడాదితో నుమాయిష్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.