ఉత్తరాంధ్రలో ముందుకొచ్చిన సముద్రం

Posted On:01-01-2015
No.Of Views:330

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. విశాఖ నగర శివారు ప్రాంతమైన యారాడలో అలల తాకిడికి చర్చి కుప్పకూలిపోయింది. అలల ఉద్ధృతి చూసి యారాడ గ్రామస్థులు భీతిల్లిపోయారు. సముద్రుడి ఆగ్రహానికి శ్రీకాకుళం జిల్లాలో 9 మరబోట్లు, వలలు కొట్టుకుపోయాయి. తీవ్రమైన గాలులకు అలల ఉద్ధృతి తోడవ్వడంతో బోట్లు, వలలు కొట్టుకుపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా సముద్రపు అలల తాకిడికి విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డు భారీగా కోతకు గురైంది. బీచ్‌ రోడ్డు నిర్మాణం తర్వాత ఇంత పెద్దఎత్తున కోతకు గురికావడం ఇదే ప్రథమం. కొన్నిచోట్ల పది అడుగుల మేర రోడ్డు కొట్టుకుపోయింది. అలల ధాటికి బీచ్‌ రోడ్డు రక్షణ గోడ అనేకచోట్ల కూలిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజుల నుంచి అలల ఉద్ధృతి పెరిగింది. బుధవారం నాటికి అల్పపీడనం విశాఖ తీరానికి మరింత సమీపానికి రావడంతో సముద్రం మరింత కల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతూ అత్యంత వేగంగా తీరాన్ని తాకుతున్నాయి. వచ్చే కెరటాలు ఏటవాలుగా కాకుండా నేరుగా రావడంతో తీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ కోతకు గురవుతోంది. బుధవారం రాత్రికి పోలీస్‌ మెస్‌ ఎదురుగా బీచ్‌రోడ్డు సగం మేర కొట్టుకుపోయింది. గురువారం నాటికి యోగా విలేజ్‌ ఎదురుగా రోడ్డు ఎక్కువ భాగం కొట్టుకుపోయింది. బీచ్‌రోడ్డు నిర్మాణం సమయంలో అలల నుంచి రక్షణ కోసం నిర్మించిన గోడ కూలిపోయింది. కొన్నిచోట్ల అలలు బీచ్‌రోడ్డుపైకి చొచ్చుకు వస్తున్నాయి. దీంతో రోడ్డు మరింత కోతకు గురయ్యే అవకాశం ఉంది. కురుసుర మ్యూజియానికి ఉత్తర భాగంలో బీచ్‌ రోడ్డు బాగా దెబ్బతింది. బీచ్‌ లోపలకు దిగేందుకు నిర్మించిన మెట్లు అలల తాకిడికి కొట్టుకుపోయాయి. కురుసుర మ్యూజియానికి ఉత్తరాన బీచ్‌రోడ్డుకు ఆనుకుని నిర్మించిన ప్రహరీ గోడ కుప్పకూలింది. దక్షిణాన ఉన్న గోడ కూడా కూలిపోయింది. అల్పపీడనం ప్రస్తుతం ఒడిసా దిశగా పయనించడంతో అలల తీవ్రత కొంత మేర తగ్గినా తీరం కోత ఆగేందుకు కొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉడా పార్కు నుంచి పాండురంగాపురం జంక్షన్‌ వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. బీచ్‌రోడ్డుకు ఆనుకుని బారికేడ్లు ఏర్పాటుచేశారు. సందర్శకుల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా జనవరి ఒకటో తేదీ కావడం, బీచ్‌ రోడ్డు కూలిపోయిందని మీడియాలో వస్తున్న కథనాలతో జనం పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా కోతకు గురైన చోట్ల తాత్కాలికంగా బండరాళ్లు వేసే పనిని గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ పోర్టు చైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు, కలెక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ ఇతర అధికారులు గురువారం సాయంత్రం బీచ్‌ రోడ్డును పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లాలో గత రెండు రోజుల నుండి సముద్ర అలల జోరుకు బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు ఛిద్రం కావడంతో ఉప్పాడ- కాకినాడ రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పాడలో 4కి.మీ, కోనపాపపేటలో అర కిలోమీటరు పొడవునా రోడ్డు కోతకు గురైంది. హుదూద్ తుపానుకు అధ్వానంగా మారిన బీచ్ రోడ్డుకు అధికారులు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోవడంతో నేడు అలల జోరుకు రోడ్డు సముద్ర గర్భంలో కలిసిపోతోంది.