అంగారకుడిపై వంద రోజులు పూర్తి చేసుకున్న మంగళయాన్...

Posted On:01-01-2015
No.Of Views:321

 భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించి శుక్రవారానికి వంద రోజులు పూర్తయింది. ఇది అద్భుతంగా పనిచేస్తోందని, శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తోందని ఇస్రో తెలిపింది. పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి. 2013 నవంబర్ 5న పీఎస్‌ఎల్వీ సీ25 ద్వారా ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఇస్రో ప్రయోగించింది. పది నెలలపాటు 66 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన మంగళ్‌యాన్.. గతేడాది సెప్టెంబర్ 24న అరుణగ్రహ కక్ష్యలోకి చేరింది. అప్పటి నుంచి మార్స్ చిత్రాలతోపాటు కీలక సమాచారాన్ని భూమికి చేరవేస్తున్నది. ఇందులోని ఐదు సైన్స్ పరికరాలు అంగారకుడి వాతావరణం, అక్కడ ఒకప్పుడు పుష్కలంగా ప్రవహించిన నీటి చరిత్రతోపాటు జీవం ఉనికి వంటి అంశాలపై పరిశోధిస్తున్నాయి. ఈ ఉపగ్రహానికి అంగారకుడిని చుట్టి రావడానికి 72 గంటల 51 నిమిషాల 51 సెనక్లు పడుతోంది. బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఆ సమాచారాన్ని సేకరించి విశ్లేషణ కోసం అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు పంపిస్తున్నది. మంగళ్‌యాన్ జీవితకాలం ఏడాదిగా నిర్ధారించినా.. అందులో ఉన్న ఇంధనంపై అది ఆధారపడి ఉంటుందని ఇస్రో అధికారి తెలిపారు. మంగళ్‌యాన్ ద్వారా తొలి ప్రయత్నంలోనే మార్స్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన తొలిదేశంగా భారత్ నిలిచింది. అందులోనూ కేవలం రూ.450 కోట్ల ఖర్చుతో 15 నెలల కాలంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు మంగళ్‌యాన్‌ను సిద్ధంచేయడం గమనార్హం. 2014లో జరిగిన 25 అద్భుత ఆవిష్కరణల్లో మంగళ్‌యాన్‌కు కూడా స్థానం దక్కింది.