కవితకు కేంద్ర మంత్రి పదవి కావాల్ట!

Posted On:02-01-2015
No.Of Views:348

సూరజ్‌`అక్షరం ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు పుత్రిక,నిజామా బాద్‌ టిఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అర్జెంటుగా కేంద్ర మంత్రి అయిపోవాల్ట!
 పిసి సర్కార్‌ మంత్రదండం తిప్పినట్లు కెసిఆర్‌, ఆమెను కేంద్ర మంత్రినీ అతి సులువుగా చేసేయగలరు? కెసిఆర్‌ పిసి సర్కార్‌ను మించిన మాంత్రికుడు. అందువల్ల  ఉన్న ఫళాన ఎన్డీఏతో సఖ్యత కుదుర్చుకొని కేంద్రమంత్రి పదవి తెచ్చుకోగలరు.అందుకే ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని ఎన్డీఏతో సఖ్యతగా ఉండి కనీసం ఒక కేంద్ర మంత్రి పదవినన్నా తెచ్చుకుందామని కవిత గత కొద్ది రోజులుగా కెసిఆర్‌ను పోరుతున్నట్లు వినిపిస్తోంది.
  ఎన్డీఏ సర్కార్‌ ఏర్పడిన కొన్నాళ్ల వరకు కెసిఆర్‌ పెడముఖంగానే ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి నిధులు రావాలంటే, సఖ్యతతో ఉండాలన్న జ్ఞానం బోధపడిరది. బిజెపితో సఖ్యతగా ఉంటే, మైనార్టీలు దూరమవుతారన్న భావన కూడా ఉంది. అందుకే బిజెపితో కేవలం అవగాహన ఒప్పందం కుదుర్చుకొని, అంశాల వారీగా సర్కారుకు మద్దతు ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు కెసిఆర్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తమ మనసులోని మాటను బిజెపి అగ్రనాయకత్వానికి వినిపించారని, రెండు మూడురోజుల్లో హైదరాబాద్‌ పర్యటనకు రానున్న పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు చర్చలు జరిపి, కవితకు మంత్రి పదవి ఇస్తే, అంశాల వారీగా మద్దతు ఖాయమని వివరించబోతున్నట్లు రాజకీయ ఆవరణలో వినిపిస్తోంది.
 ఏపీలో టిడిపి, ఎన్డీఏతో సఖ్యతగా ఉండి మంత్రి పదవి తెచ్చుకుందని, అదే విధంగా మద్దతు ప్రకటించి, కేంద్ర మంత్రి పదవి తెచ్చుకుంటే, రాబోయే రోజుల్లో  కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా తెచ్చుకోవచ్చునని, అదీగాక శాఖా పరంగా అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా చేపట్టవచ్చునని కవిత, కెసిఆర్‌కు నచ్చజెప్పినట్లు వినిపిస్తోంది. ఇటీవల కవితే, స్వయంగా వెంకయ్యనాయుడిని కలిసిన సంర్భంలో తెరాస,ఎన్డీఏ సర్కార్‌కు అంశాల వారీగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేసినట్లు వినిపిస్తోంది. తెరాస నుండి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే బిజెపి అధిష్టానం, ఈ విషయమై కాస్తంత సీరియెస్‌గానే ఆలోచిస్తున్నట్లు వినికిడి. ఆంధ్రా,తెలంగాణలలో బిజెపి,టిడిపితో పొత్తు కుదుర్చుకుంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నాయి. ఇప్పుడు బిజెపితో తెరాస అవగాహన కుదుర్చుకున్న పక్షంలో రాజకీయాలు ఎలా ఉంటాయి? టిడిపిని వ్యతిరేకిస్తున్న తెరాస,ఆ పార్టీతో కలిసి పని చేయగలుగుతుందా? అలాంటప్పుడు ఏం చెయ్యాలని కిషన్‌రెడ్డి, వెంకయ్యనాయుడితో పాటు పార్టీ జాతీయ నాయకత్వం ఒకటే బుర్రలు  బద్దలు కొట్టుకుంటుంది. అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 మొత్తానికి చిన్నమ్మ కోరిక తీర్చేందుకు కెసిఆర్‌, ఎంఐఎం దోస్తానీని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు మరి!