నారాకు టిటిడిపి బాధ్యతలు?

Posted On:02-01-2015
No.Of Views:370

అక్షరం ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అధినేత, టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన ‘ఆపరేషన్‌ గులాబీ’కి టిటిడిపి పార్టీ బాగానే ఆకర్షితురాలైంది. ఈ ఆపరేషన్‌లో ఈ మధ్యనే పార్టీలో ప్రముఖులు,పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పని చేసిన తుమ్మల,తీగల కృష్ణారెడ్డి, తలసాని 
నివాసయాదవ్‌ టిఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో పార్టీ చితికిపోతుం దని భావించిన చంద్రబాబునాయుడు, తన కుమారుడు నారా లోకేష్‌కు తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనల్లో ఉన్నారు.
 టిటిడిపి కన్వీనర్‌గా ఉన్న రమణ పెద్ద వాక్చార్యం ఉన్నవాడు కాదు. మాస్‌ నాయకుడు అసలే కాదు. తెరాస సర్కార్‌ తప్పులపై ఉద్యమాలను నడిపించగల సత్తా రమణలో లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఎర్రబెల్లి, కెసిఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత హుందాగా పదవి నుంచి తప్పుకోగా, ఆయన స్థానంలో రమణను నియమించారు. అప్పటి నుండి పార్టీ నిరాశపూరిత వాతావరణం ఏర్పడటం, దీన్ని అవకాశంగా తీసుకొని కెసిఆర్‌, నయానా,భయానో టిడిపి శ్రేణుల్ని తెరాసలోకి లాక్కోవడం కనిపిస్తోంది.
 ఇప్పటికీ మేలుకోకపోతే పార్టీ కేడర్‌ పూర్తిగా మాయమైపోతుందని భావించిన చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌ను రంగంలోకి దించాలన్న ఆలోచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఆంధ్రాలో యాభైలక్షల సభ్యత్వాలను పూర్తి చేసి ఆనందంలో మునిగి తేలుతున్న టిడిపికి, ఇక్కడ నిరాశాజనకంగా సభ్యత్వ నమోదు జరుగుతుండటంతో నారా లోకేష్‌ స్వయంగా జిల్లాలు తిరిగి నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కొడుకుకు బాసటగా నిలిచేందుకు చంద్రబాబునాయుడు సైతం తెలంగాణ జిల్లాల్లో పర్యటించబోతున్నట్లు వినిపిస్తోంది.
లోకేష్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించేందుకు ముందస్తుగానే చంద్రబాబునాయుడు టిటిడిపి నాయకుల అభిప్రాయాలను తెలుసుకోగోరడంతో ఎక్కువ మంది నారా లోకేష్‌కే ఓటేశారని తెలిసింది. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు తెలంగాణ పార్టీ పగ్గాలను లోకేష్‌కు ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి నుంచే లోకేష్‌తో పాటు, చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు,జిల్లా పర్యటనలు జరిపే అవకాశాలు. ఇక దాదాపు ప్రకటించకపోయినా నారా లోకేష్‌కు తెలంగాణ పార్టీ  పగ్గాలు అప్పగించినట్లేనని చెప్పొచ్చు.