గ్యాంగ్ రేప్ నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On:03-01-2015
No.Of Views:312

మార్ఫింగ్‌ ఫోటోలను అడ్డుపెట్టుకుని అమ్మాయిలను వేధించిన కేసులో ప్రధాన నిందితుడైన రవీంద్ర ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఓ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన రవీంద్ర విశాఖ బీచ్‌ రోడ్డులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేయడానికి వెళ్లారు. ఇది గమనినంచిన రవీంద్ర పినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రవీంద్రను స్థానికంగా ఉన్న ఓ కార్పోరేట్‌ ఆసుపత్రికి తరలించారు. రవీంద్రను పరిశీలించిన వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. ఇదిలా ఉండగా రవీంద్రను పోలీసులు గత వారమే అరెస్టు చేశారని, పట్టణంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో అతన్ని విచారిస్తుండగా పినాయిల్‌ తాగాడని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు మొదటగా స్టేషన్‌ సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కార్పోరేట్‌ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాగా నిందితుడు రవీంద్రకు పెద్ద నేర చరిత్రే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లాకు చెందిన రవీంద్రపై గతంలో మైలవరంలో కొంతమంది అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి ఇంజినీరింగ్‌ చదువుకోసమని రవీంద్ర విశాఖకు వచ్చాడు. మార్ఫింగ్‌ ఫోటోలను చూపి ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రవీంద్రను పట్టుకోవడానికి బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే రవీంద్ర అరెస్ట్‌ చేస్తుండగా పినాయిల్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.