నిత్యానంద ఆశ్రమంలో యువతి శవం

Posted On:03-01-2015
No.Of Views:339

వివాదాస్పద స్వామి నిత్యానంద మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఆశ్రమంలో 24 ఏళ్ల యువతి మృతదేహం బయటపడింది. ఈ యువతి ఎలా చనిపోయిందనేది తెలియడం లేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, యువతి మరణించిన విషయాన్ని ఆశ్రమ వర్గాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ యువతి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోస్టు మార్టం నివేదిక ద్వారా అసలు విషయాలు బయటపడుతాయని వారన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలని వారు డిమాండ్ చేశారు. తమ కూతురు గత నాలుగేళ్ల నుంచి ఆశ్రమంలో ఉంటోందని, ఆమెకు ఏ విధమైన అనారోగ్యం లేదని వారు చెప్పారు. తమ కూతురు ఉన్నట్లుండి మరణించడం అనుమానాలకు తావు ఇస్తోందని వారన్నారు. ఇటీవల పురుషత్వ పరీక్షల నివేదిక కూడా నిత్యానందకు వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే. నిత్యానంద స్వామి పురుషుడేనని ఇటీవల తేలింది. ఆయనకు నిర్వహించిన లైంగిక సామర్థ్య పరీక్షలలో ఈ మేరకు వెల్లడైందని సీఐడీ అధికారులు వెల్లడించారు. సీఐడీ డీఎస్పీ లోకేశ్‌ నేతృత్వంలోని పోలీసు బృందం ఈ మేరకు వైదుల ధ్రువీకరణ పత్రాలతో కూడిన నివేదికను రామనగర్‌లోని సెషన్స్‌ కోర్టుకు సమర్పించింది. ఇటీవల బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో ప్రఖ్యాత వైద్యబృందం నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయనకు ఎటువంటి లోపమూ లేదని నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిత్యానంద సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షలు నిర్వహించాల్సిందేనని, వైద్యులకు సహకరించాలని సుప్రీం ఆదేశించిన విషయం విదితమే.