విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏడేళ్ల చిన్నారి

Posted On:03-01-2015
No.Of Views:315

అమెరికాలోని కెంటకీలో జరిగిన విమాన ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడాలో ఒక చిన్న విమానం బయలుదేరింది. అందులో నలుగురు పెద్దలు, ఒక ఏడేళ్ల పాప ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ విమానం దట్టమైన వృక్షాలున్న ప్రాంతంలో కూలిపోయింద దీంతో విమానాశ్రయ అధికారులకు ఆ విమానం గురించిన సమాచారం అందలేదు. అయితే ప్రమాదంలో నలుగురు పెద్దలు మృతి చెందగా, అనూహ్య పరిస్థితుల్లో ఏడేళ్ల పాప మాత్రం చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత రెండు మూడు గంటలకు కెంటకీలోని లయన్‌ కౌంటీలోని ఓ ఇంటికి వెళ్లిన ఆ పాప తలుపు కొట్టింది. ఇంటి యజమాని తలుపు తీసి చూస్తే ఏడేళ్ల పాప కనిపించింది. శరీరంపై కాస్త గాయాలు ఉన్నాయి గాని అవేమంత పెద్దవి కావు. ఆ పాప ఇంటి యజమానికి జరిగిన విషయాన్ని తెలిపింది. అంత పెద్ద ప్రమాదంలో చిన్న చిన్న గాయాలు మాత్రమే తగిలి, నలుగురు పెద్దవాళ్లు మరణిస్తే ఈ పాప ఒక్కతే బ్రతికిందా, పైగా నడుచుకుంటూ ఈ రాత్రి వేళ వచ్చిందా అని ఆశ్చర్యానికి గురైన ఆ ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. విమానం కూలిపోవడంగురించి సమాచారం లేని పోలీసులకు ఆ మాటలు నమ్మశక్యంగా కనిపించనప్పటికీ పాపను చూడడానికి వచ్చారు. పాప కొంత మానసికంగా ఆవేదనగా ఉండటం గుర్తించి వెంటనే పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, పాప చెప్పిన వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా కూలిపోయిన విమాన శిథిలాలు కనిపించాయి. ఆ సమీపంలోని సరస్సులో విమానంలోని నలుగురి మృతదేహాలు లభించాయి.