కోర్టుకు ఎంసెట్ చిచ్చు?

Posted On:03-01-2015
No.Of Views:314

ఎంసెట్‌ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఎంసెట్ తామే నిర్వహిస్తామనే తెలంగాణ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధపడుతోంది. ఈ వ్యవహారంపై రాజభవన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం గవర్నర్‌ నరసింహన్‌ను కలుసుకున్నారు. విభజన చట్టం ప్రకారం ఎంసెట్‌ నిర్వహించే హక్కు, అధికారం తమకే ఉన్నందున తెలంగాణ ప్రభుత్వానికి నచ్చజెప్పి ఎంసెట్‌ నిర్వహించే అవకాశాన్ని తమకే కల్పించాలని ఆయన ఈ భేటీలో గవర్నర్‌ను కోరారు అయితే ఒకవేళ గవర్నర్‌ గనక ఈ అంశంపై ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపించని పక్షంలో ఇక కోర్టు మెట్లు ఎక్కడం తప్ప మరో మార్గం లేదని కూడా గంటా గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో భేటీ తర్వాత గంటా శ్రీనివాస రావు అదే విషయాన్ని మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఎంసెట్ వివాదంపై కేంద్రానికి విన్నవిస్తామని, న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఉమ్మడి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలని విభజన చట్టంలో ఉందని ఆయన అన్నారు. తామే నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆయన అన్నారు. ఈ వివాదంపై రాజభవన్ శనివారంనాడు ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరికి గవర్నర్‌ సానుకూలమని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గవర్నర్ కార్యాలయం రాజభవన్ ప్రకటించింది. ఇరురాష్ర్టాల మధ్య ఆమోదయోగ్య పరిష్కారానికి గవర్నర్‌ ప్రయత్నిస్తుని ఆ ప్రకటనలో చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లోని విద్యార్ధులకు మేలు జరగాలన్నది గవర్నర్‌ అభిప్రాయమని ఉమ్మడి పరీక్షల నిర్వహణపై గవర్నర్‌ కార్యాలయం ప్రకటించింది. వివాదంపై ఇరు రాష్ట్రాలు చర్చించుకుని పరిష్కారం చేసుకోవాలని అన్నారు. కాగా, షెడ్యూలు పది ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికే ఎంసెట్‌ నిర్వహించే అధికారం ఉన్నట్టు భావిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగం ఇప్పటికే ఎంసెట్‌ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే అది తొందరపాటు చర్య అని, విభజన చ ట్టం ప్రకారం ఎంసెట్‌ నిర్వహించే హక్కు తమకే ఉందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఇటీవల పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. మంత్రి గంటా ఇటీవల కలిసినప్పుడు కూడా గవర్నర్‌ను కలిసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి రాజధానిగా ఇంకా పదేళ్లు కలిసే ఉంటాం కాబట్టి ఎంసెట్‌ నిర్వహణ అవకాశం తమకే కల్పించాలని కోరారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సైతం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసినప్పుడు ఎంసెట్‌ నిర్వహించుకునే అవకాశాన్ని తమకే ఇవ్వాలని కోరినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ పంచాయతీని గవర్నర్‌ గనక పరిష్కరించలేకపోతే సుప్రీం కోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్లాలన్నది ఆంధ్రప్రదేశ్‌ ఆలోచనగా కనిపిస్తున్నది. తెలంగాణ కల నెరవేరిన తర్వాత కూడా ఎంసెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించడం ఏమిటన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రశ్న.