మార్చిలో త్రిష పెళ్లి బాజాలు

Posted On:04-01-2015
No.Of Views:321

మార్చి నెలలో త్రిష మూడుముళ్లకు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చెన్నై చిన్నదాని వివాహం గురించి కొంత కాలంగా రకరకాల వార్తలు హోరెత్తుతున్నాయి. ఇటీవల త్రిష తన ప్రేమికుడిగా ప్రచారంలో వున్న వరుణ్‌మణియన్‌తో ప్రత్యేక విమానంలో ఆగ్రా అందాలను చుట్టొచ్చారు కూడా. త్రిష ఇంట ఈసారి బాజాభజంత్రీలు మోగడం ఖాయం అంటున్నారు. త్రిష 2002లో లేసా లేసా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. నాయికగా పుష్కర కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.తిష నటించిన భూలోకం, ఎన్నై అరిందాల్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు జయం రవి సరసన అప్పాటక్కర్, తెలుగులో బాలకృష్ణకు జంటగా లయన్ చిత్రాల్లో నటిస్తున్నారు. నూతన అవకాశాలను అంగీకరించడం లేదని సమాచారం. త్రిషకు వివాహ ఘడియలు ముంచుకొస్తున్నాయనే టాక్ జోరుగా సాగుతోంది. మార్చిలో,పీటలెక్కనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లతో ఆమె తల్లి ఉమకృష్ణ తలమునకలవుతున్నట్లు కోలీవుడ్ టాక్. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖుల మధ్య త్రిష పెళ్లి వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.నూతన సంవత్సరం సందర్భంగా త్రిష తన ట్విట్టర్‌లో అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ తాను అజిత్‌తో కలిసి నటించిన ఎన్నై అరిందాల్ చిత్ర ట్రైలర్ చూసి మీరు చేసిన కామెంట్స్ చాలా సంతోషం కలిగించాయని పేర్కొన్నారు. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని కూడా అనడం విశేషం.సినిమాను వీడను: త్రిష ఇంకా తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తాను పెళ్లి చేసుకున్న తరువాత నటించే ఆలోచన లేదని సినిమాను వీడనని స్పష్టం చేశారు. దీంతో దర్శకత్వం వైపు దృష్టి సారించే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలమాట. త్రిషకు స్త్రీ సమస్యలపై, జంతు సంరక్షణల ఇతివృత్తాలతో చిత్రాలను తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.