స్నేహితుడితో నవ వధువు పరారీ

Posted On:05-01-2015
No.Of Views:338

 తిరువట్టారుకు చెందిన యువకుడు ఒకరితో నాగర్‌కోయిల్ సమీపన ఉన్న ఎరచ్చి కులం ప్రాంతానికి చెందిన యువతికి తల్లిదండ్రులు వివాహ నిశ్చితార్థం చేశారు. వారి వివాహం ఎరచ్చి కులంలో సోమవారం జరగాల్సి ఉంది. పెళ్లికూతురు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ వివాహానికి రెండు రోజుల క్రితం ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఆమెతో పాటు ఓ యువకుడు వచ్చాడు. తన స్నేహితుడిగా కుటుంబీకులకు పరిచయం చేసింది. వధువు ఇంట్లో అతను అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. ఏర్పాట్లలో సేవలందించాడు. 
ఆదివారం సాయంత్రం వరుడు బంధువులు వధువు ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ స్నేహితుడ్ని చూసి నోరు వెళ్లబెట్టారు. అర్థరాత్రి సమయంలో వధువు తండ్రి కల్యాణ మండపం నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వధువు, ఆ స్నేహితుడు కానరాలేదు. ఆ ఇద్దరూ ఓ మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్టు ఆ పరిసర వాసులు పేర్కొనడంతో ఆందోళన చెందారు. తిరువట్టారులోని వరుడుకి సమాచారం అందించారు. అయితే, పెళ్లి నిలపవద్దని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించాడు. వధువు సోదరితో వివాహం జరిగింది. స్నేహితుడితో వధువు పరారు కావడం ఆ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది.