వివాదం ముగిసింది

Posted On:05-01-2015
No.Of Views:306

 పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అనుకున్నది సాధించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె పేరును ప్రత్యేకంగా హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. దీంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న వివాదం ముగిసినట్టయ్యింది. అయితే నిర్ణీత గడువులోగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఆమె నామినేషన్‌ను తమకు పంపలేదని మరోసారి తేల్చి చెప్పింది.‘సైనా నెహ్వాల్ సాధించిన ఘన విజయాల ఆధారంగా ఆమె పేరును ప్రత్యేక కేసుగా పరిగణించి హోం శాఖకు ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ ఏడాదే కాకుండా 2013లోనూ సైనా పేరును ప్రతిపాదిస్తూ బాయ్ నుంచి మాకు ఎలాంటి లేఖ అందలేదు. అందుకే హోం శాఖకు ఆమె పేరును పంపలేకపోయాం. అలాంటప్పుడు పద్మ అవార్డుల విషయంలో ఐదేళ్ల నిర్ణీత గడువు ముగిసినా పట్టించుకోవడం లేదనే వాదన అర్థరహితం. ఈనెల 3న మాత్రమే బాయ్ నుంచి నామినేషన్ అందింది’ అని క్రీడా శాఖ తెలిపింది.
డిమాండ్ చేయడానికి నేనెవర్ని: సైనా
‘పద్మభూషణ్’ విషయంలో తన ఆవేదనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని సైనా నెహ్వాల్ ఆరోపించింది. తానేనాడూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం డిమాండ్ చేయలేదని స్పష్టం చేసింది. ‘పద్మభూషణ్ అవార్డును నాకెందుకు ఇవ్వరు? అనే ఉద్దేశంతో అడిగినట్టు మీడియా ఫోకస్ చేసింది. కానీ నా ఉద్దేశం అది కాదు.అసలు ఆ అవార్డును డిమాండ్ చేసేందుకు నేనెవర్ని? నేను కేవలం క్రీడాకారిణిని. దేశం కోసం ఆడుతున్నాను. నా పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయంలో క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని సైనా స్పందించింది.
 రాష్ట్రపతి నామినేట్ చేయాల్సి ఉంటుంది
 పద్మభూషణ్ అవార్డు కోసం బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేరును గడువు ముగిసినా కేంద్ర క్రీడా శాఖ... హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించినప్పటికీ ఈ అవార్డు ఆమెకు దక్కడం సందేహంగానే ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని లేక హోం మంత్రి మాత్రమే చివరి నిమిషంలో ఎవరి పేరునైనా పద్మ అవార్డుల కమిటీకి ప్రతిపాదించే అధికారం ఉంటుంది.మరోవైపు సైనా పేరును సోమవారం ప్రతిపాదించామని, తుది నిర్ణయం హోం శాఖ తీసుకుంటుందని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 15నే నామినేషన్ల గడువు ముగియగా అవార్డుల కోసం 1878 నామినేషన్లు వచ్చాయి. ఇందులో నుంచి రెండు పద్మవిభూషణ్, 24 పద్మభూషణ్, 101 పద్మశ్రీ అవార్డులను ఈనెల 26న ప్రకటిస్తారు.