రెండో పెళ్ళి చేసుకున్నా: మొదటి భార్యతో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్

Posted On:06-01-2015
No.Of Views:316

ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ తన రెండో వివాహానికి గల కారణాలను వెల్లడించారు. మాజీ భార్య జమిమా గోల్డ్‌స్మిత్‌ను కలిసి.. తన రెండో పెళ్లికి కారణాలను తెలిపారు. 62 ఏండ్ల ఇమ్రాన్‌ఖాన్ తన కన్నా 20 ఏండ్లు చిన్నదైన బిబిసి జర్నలిస్టు రెహమ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. రెహమ్‌ఖాన్‌కు కూడా ఇది రెండో పెళ్లే. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ఈ రహస్య వివాహం గురించి మొదట ప్రపంచానికి వెల్లడించింది జమిమానే. ఆయన రెండో పెళ్లిపై కుటుంబసభ్యుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో లండన్‌కు వచ్చిన ఇమ్రాన్ జమిమాను, కొడుకులను కలిసి తన రెండో పెళ్లికి కారణాలు వివరించారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు తాను బహిరంగంగానే చెప్పానని తెలిపారు. పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి మళ్లీ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇమ్రాన్ తనతో చెప్పినట్టు జమిమా వెల్లడించారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ రెండో వివాహంపై పాకిస్థాన్‌లో పలు వర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి.