చిరు కన్నా జగన్ బెటర్ట!?

Posted On:06-01-2015
No.Of Views:350

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం, ప్రతిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఐదారు సీట్లు గెలుచుకున్నప్పటికీ అది టీడీపీతో పొత్తు పెట్టుకొని, ప్రభుత్వంలో కొనసాగుతోంది. మరోవైపు, నిన్నటి దాకా, పదేళ్ల పాటు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజిత ఏపీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించారు. కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఇందుకు విభజనకు తోడు మోడీ హవా, బాబు పాలనా అనుభవం, జగన్ పైన ప్రజల సానుభూతి, పవన్ కళ్యాణ్ ప్రచారం తదితరాలు కూడా కలిశాయని చెప్పవచ్చు. అయితే, విభజన ఎఫెక్ట్ వల్లనే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రజలు తిరస్కరించారు.  ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీ, టీడీపీల వైపు చూస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇంకొందరు నేతలు కూడా చేరుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో చిరంజీవి ఒక్కరే మిగిలారు. అయితే, గత ఎన్నికల్లో విభజన ప్రభావం ముందు చిరు ఇమేజ్ నిలవలేదనే చెప్పవచ్చునని అంటున్నారు. 2019 వరకు కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవాలంటే మళ్లీ జగన్‌ను కాంగ్రెస్‌లోకి రప్పించుకోవడమే మార్గమనే వాదనలు తాజాగా వినిపిస్తున్నాయి. ఏపీలో తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి జగనే ఇప్పుడు గతి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకోసం అధిష్టానం కూడా పావులు కదుపవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ 2019 నాటికైనా సీఎం కావాలని చూస్తున్నారు. అయితే, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం, టీడీపీకి ధీటుగా ప్రజలు తమ పార్టీని ఆదరించిన నేపథ్యంలో వైయస్ జగన్ అసలు కాంగ్రెస్ వైపు వెళ్తారా? వెళ్తే ఏం షరతులు పెడతారు? అనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్, చిరంజీవి ఒక్క ఒరలో ఇమడలేరని కూడా అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. జగన్ తమ పార్టీ వాడేనని, ఎప్పటికైనా రావాల్సిన వాడేనని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.