విషప్రయోగంతోనే సునందా పుష్కర్ మరణం

Posted On:06-01-2015
No.Of Views:281

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. అది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో.. సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు.  న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. అది సహజ మరణం కాదని, విషప్రయోగం వల్ల ఆమె చనిపోయారని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ నివేదిక ఇవ్వడంతో సునంద మృతిపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం ఎవరినీ అనుమానితులుగా పేర్కొనలేదు. సునంద మృతిచెంది సంవత్సరం గడచిన తరువాత ఈ కేసు నమోదు కావడం విశేషం.ఆమె హత్యకు గురైందని, ఈ కేసుపై దర్యాప్తు జరుపుతామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ మంగళవారం స్పష్టం చేశారు. థరూర్‌ను కూడా ప్రశ్నిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నిస్తామన్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302(హత్య) సహా పలు సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ‘ఆమెకు ఎవరైనా బలవంతంగా విషాన్ని ఇచ్చారా? లేక ఆమే స్వయంగా విషాన్ని తీసుకున్నారా? అన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఆ విషయంపై కూడా దర్యాప్తు జరుపుతాం’ అన్నారు. ‘ఆ విషం ఏమిటి? ఎంత మొత్తంలో తీసుకున్నారన్నది నిర్ధారణ కాలేదు. కానీ విషాన్ని ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేసి ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు’ అని చెప్పారు.  ఆ విషం ఏమిటనేది తెలుసుకోవడానికి ఆమె అవయవ భాగాలను విదేశాలకు పంపి పరీక్ష చేయించాల్సి ఉందన్నారు. కాగా, ఈ కేసును మొదటి నుంచీ దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.