అమిత్ షా సమక్షంలో బిజెపిలోకి కిరణ్ రెడ్డి

Posted On:06-01-2015
No.Of Views:349

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయమైనట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీ యవర్గాలు తెలిపాయి. పలు సార్లు సంప్రదింపులు జరిగిన మీదట కిరణ్‌ కుమార్ రెడ్డిన చేర్చుకునేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించినట్లు తెలిసింది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ కాంగ్రెసు పార్టీ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ సోమవారం రాంమాధవ్‌ను కలుసుకున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు సామినేని ఉదయభానుతో పాటు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, మాజీ మంత్రి కొణతల రామకృష్ణ పలువురు నేతలు ఏ క్షణంలోనైనా బీజేపీలో చేరవచ్చునని విశ్వసనీయంగా తెలిసింది. అమి త్‌షా గురు, శుక్ర వారాల్లో హైదరాబాద్‌, విజయవాడల్లో పర్యటించినప్పుడు మరికొందరు నేతలను చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకుంటారని బిజెపి నేతలు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా బిజెపిలో చేరుతారంటూ పుకార్లు పుట్టాయి. అయితే, ఆయన ఆయన బిజెపి నేతలను సంప్రదించిన దాఖలాలు లేవని అంటున్నారు. లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు, అఖిల భారత గిరిజన సమాఖ్య (ఏఐఎస్‌టీఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు తేజావత్‌ బెల్లయ్య నాయక్‌ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. గురువారం హైదరాబాద్‌ వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో ఆయన బిజెపిలో చేరుతారని అంటున్నారు.