అమిత్ షా మిషన్

Posted On:06-01-2015
No.Of Views:301

అన్ని రాష్ట్రాల్లో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భారీ ప్రణాళికతో బుధవారం హైదరాబాద్ వస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరబోతున్నారు. కొత్తగా పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న నేతలను చూసి పార్టీలో ఆశలు రేకెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా పార్టీని పటిష్టం చేసేందుకు అప్పటి పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అనేక సూచనలు చేసినా, అనుకున్నంతగా పార్టీ ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదగలేదని పార్టీ జాతీయ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై కొంత మంది ప్రముఖులతో రహస్య నివేదికలను రప్పించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా ఆ నివేదికల ఆధారంగా పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా జి కిషన్‌రెడ్డి, ఆంధ్రా అధ్యక్షుడిగా హరిబాబు వ్యవహరిస్తున్నారు. గత నెలలోనే తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించినా, అనుకున్నంత ఫలితాలు రావడం లేదనే భావన జాతీయ నాయకత్వంలో వ్యక్తమవుతుండగా, స్థానిక నేతలు కూడా జాతీయ నాయకత్వ ధోరణిపై కినుక వహిస్తున్నారు. తాజా సమగ్ర సమావేశాల్లో స్పష్టమైన అవగాహనతో పార్టీ రెండు రాష్ట్రాల నాయకత్వాలను మార్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇప్పటికే ఒరిస్సాలో పర్యటిస్తున్న అమిత్ షా 7వ తేదీ రాత్రి 9.10కి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్న అమిత్ షా విమానాశ్రయం నుండి నేరుగా పర్యాటక భవన్‌కు వెళ్తారు. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటారు. 8వ తేదీ ఉదయం పర్యాటక భవన్‌లో పార్టీ పదాధికారులు, సీనియర్లతో సమావేశం అవుతారు. అనంతరం 11 గంటలకు సెస్ భవనంలో పార్టీ సభ్యత్వం విషయమై మరో సమావేశంలో పాల్గొని రాత్రి 7.20కి హైదరాబాద్‌లో బయలుదేరి రాత్రి 8.20కి విజయవాడ చేరుకుంటారు. 8వ తేదీ రాత్రి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ నేతలతో సమావేశం అవుతారు. 9వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ పార్టీ పదాధికారులతో సమావేశం అవుతారు.