సత్యార్థి నోబెల్ జాతికి అంకితం

Posted On:07-01-2015
No.Of Views:325

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తన అవార్డును జాతికి అంకితం చేశారు. బుధవారం , భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి తన మెడల్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. సత్యార్థి నోబెల్ బహుమతి అందుకోవడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. సత్యార్థి తన సేవలను మరింతగా కొనసాగించాలని కోరారు.  గతంలో బహుమతి పొందిన భారతీయులు మెడల్‌ను తమ వద్దే ఉంచుకున్నారని, సత్యార్థి తన మెడల్‌ను రాష్ట్రపతి భవన్ మ్యూజియమ్‌లో అందుబాటులో ఉంచడం మంచి నిర్ణయమని ప్రశంసించారు.డా.సి.వి. రామన్ తన నోబెల్ బహుమతిని జాతికి అంకితం చేస్తూ చేసిన ప్రసంగాన్ని రాష్ట్రపతి గుర్తుచేశారు. కైలాష్ మాట్లాడుతూ దేశానికి తన మెడల్‌ను అంకితం చేస్తున్నానన్నారు. ప్రపంచం భారత్‌వైపు చూస్తోందని, బాలల హక్కులను రక్షించడం అందరి సమష్టి బాధ్యత అని చెప్పారు.  నోబెల్ ద్వారా గెలుచుకున్న నగదును బాలల సంక్షేమానికే వినియోగిస్తానని ఆయన తెలిపారు. సత్యార్థి బహూకరించిన నోబెల్ అవార్డు రాష్ట్రపతి భవన్‌లోని మ్యూజియమ్‌లో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.  సత్యార్థి గత డిసెంబర్ 10న పాకిస్తాన్ బాలిక మలాలాతో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు.