తీర్థయాత్రలో విషాదం, గ్యాస్ సిలిండర్ పేలుడు

Posted On:07-01-2015
No.Of Views:323

తెల్లారితే ఆ స్వామి తలపై ఇరుముడి పెట్టుకుని శబరిమలైకి బయలలుదేరాల్సిన సమయంలో విషాదం చోటు చేసుకుంది. సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకవ్వడంతో మంటలు అంటుకున్నాయి. రెండు కుటుంబాలకు చెందిన 13 మందిని ఆ సిలిండర్‌ క్షతగాత్రులను చేసింది. ఈ ఘటన బుధవారం రాత్రి హైదరాబాదులోని ఎల్‌బీనగర్‌లోని భరత్‌నగర్‌ కాలనీలో జరిగింది. మాదగోని ఎల్లేష్‌ ఆటోడ్రైవర్‌. కొద్దిరోజుల క్రితం ఆయన స్వామిమాల ధరించాడు. దీక్ష పూర్తికావడంతో గురువారం శబరిమల యాత్రకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఊళ్లో ఉన్న తల్లిదండ్రులను, బంధువులను ఇరుముడి కట్టుకోవడానికి ఆహ్వానించాడు. నల్లగొండ జిల్లా కట్టెంగూడు గ్రామంలో ఉంటున్న ఎల్లేష్‌ తల్లిదండ్రులు రాములు, మాణిక్యమ్మ, సోదరి వెంకటమ్మ, ఈమె కుమార్తె రేణుక, మనవరాలు అమ్ములు భరత్‌నగర్‌ వచ్చారు. ఎల్లేష్‌ శబరిమల యాత్ర సందర్భంగా ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు. ఇంతలో సిలిండర్‌ అయిపోవడంతో పక్కనే ఉన్న మరో సిలిండర్‌ను పెట్టారు. దీనికి వాషర్‌ లేకపోవడంతో పైమూత తీయగానే ఒక్కసారిగా గ్యాస్‌ పైకి వచ్చింది. అక్కడే ఉన్న ఎల్లేష్‌ సిలిండర్‌ను తీసుకువచ్చి ఇంటి ముందున్న రహదారిపై పడేశాడు. అప్పటికే గ్యాస్‌ తీవ్రంగా పైకి వచ్చింది. ఎల్లేష్‌ ఇంటికి పది అడుగుల దూరంలో ఉన్న కాలమ్మ ఇంట్లో వంట చేస్తుండగా ఆ మంటల వరకు గ్యాస్‌ వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఆ వీధి మొత్తం మంటలు కనిపించాయి. ఈ ఘటనలో ఎల్లేష్‌తోపాటు భార్య విజయ, కుమారుడు సాయిదర్శన్‌, అక్క విజయ, ఆమె కుమార్తె రేణుక, మనవరాలు అమ్ములు, ఎదురింట్లో ఉన్న కాలమ్మ, ఆమె కోడలు లక్ష్మి, మనవడు ప్రణీత్‌ గాయపడ్డారు. వీరిలో రేణుక, కాలమ్మ, లక్ష్మి, ప్రణీత్‌, సాయిదర్శన్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. రేణుక, కాలమ్మ, మాణిక్యమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వీరికి కొత్తపేటలోని ఒమిని ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.