ఆస్పత్రిలో చేరిన శశి థరూర్

Posted On:07-01-2015
No.Of Views:307

సునంద పుష్కర్ మృతిని హత్య కేసుగా నమోదు చేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆమె భర్త. మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు నోటీసులు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా విచారణకు హాజరు కావాలని వారు ఆయనకు సూచించారు. కాగా, శశి థరూర్ అనారోగ్యంతో ,ఆస్పత్రిలో చేరారు. కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. హత్య కేసు విచారణ కోసం సాధ్యమైనంత త్వరగా హాజరు కావాలని సూచిస్తూ శశి థరూర్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160వ సెక్షన్ కింద పోలీసులు ఆయనను విచారించనున్నారు. సునంద పుష్కర్ మృతిని పోలీసులు హత్య కేసుగా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎయిమ్స్ వైద్య నిపుణుల నివేదిక ఆధారంగా పోలీసులు కేసును మార్చారు. కేసుపై తాజా దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ బుధవారంనాడు చెప్పారు. తనతో పాటు పనిమనిషిని కూడా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ థరూర్ ఆరోపించారు. పోలీసులు నవంబర్ 7వ తేదీన 16 గంటల పాటు, 8వ తేదీన 14 గంటల పాటు పని మనిషి నారాయన్ సింగ్‌ను నలుగురు పోలీసు అధికారులు ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. నారాయన్ సింగ్‌పై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన భార్యను చంపినట్లు ఒప్పుకోవాలని సింగ్‌ను పోలీసులు హింసించారని ఆయన ఆరోపించారు. కాగా, శశి థరూర్‌పై దర్యాప్తు జరగకుండా గత యుపిఎ ప్రభుత్వం అడ్డుకుందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.