రోజుకో వివాదంతో అమీర్‌ఖాన్‌

Posted On:07-01-2015
No.Of Views:347

రోజుకో వివాదంతో అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రధారిగా రాజ్‌కుమార్‌ హిరాణీ రూపొందించిన ‘పీకే' ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల్లో కొన్ని కోర్టుకు ఎక్కాయి. తాజాగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ‘‘ఈ సినిమాలో ప్రమాదకర అంశాలేమీ లేవు'' అని వ్యాఖ్యానించింది. హిందూ దేవుళ్లను ఈ చిత్రంలో కించపరిచారంటూ గౌతమ్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు. హిందూ దేవుళ్లు, హిందూ విశ్వాసాలు, మనోభావాలు, పూజలు వంటివాటికి వ్యతిరేకంగా ఈ చిత్రంలో సన్నివేశాలున్నాయి కాబట్టి, ‘పీకే'ని నిషేధించాలన్న పిటిషనర్‌ ఆరోపణలను ప్రధాన న్యాయమూర్తి జి. రోహిణి, న్యాయమూర్తి ఆర్‌.ఎస్‌. ఎండ్‌లాతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. పైగా ‘‘సినిమాలో చెడుగా ఏం చూపించారు? ఇందులో ప్రమాదకర అంశాలేమీ మాకు కనిపించలేదు. పిటిషన్‌లోనే ఎలాంటి హేతువూ కనిపించలేదు'' అని తేల్చిచెప్పింది. చిత్రం భాక్సాఫీస్ విషయానికి వస్తే... ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ నటించిన పీకే చిత్రం సరికొత్త బాక్సాఫీసు రికార్డులను సృష్టిస్తోంది. చిత్రం ఆదాయం ఇప్పటికే రూ. 300 కోట్లు దాటడంతో అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్‌ చిత్రంగా ఖ్యాతికెక్కింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా వున్న ధూమ్‌-3 చిత్రం రికార్డును పీకే బద్దలు కొట్టింది. ఆమిర్‌ ఖాన్‌ నటించిన తాజా బాలీవుడ్‌ చిత్రం ‘పీకే' ఇంటా బయటా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్‌ 19న విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి ఏకంగా 544 కోట్ల రూపాయలను వసూలు చేసి ఆల్‌టైమ్‌ రికార్డును సాధించింది. ఇందులో ఓవర్‌సీస్‌ వసూళ్లే 134 కోట్ల రూపాయలు కావటం విశేషం. గతంలో 542 కోట్ల గరిష్ఠ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న ‘ధూమ్‌-3' రికార్డును పీకే బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచేలా కొన్ని దృశ్యాలున్నాయని అభ్యంతరాలు వ్యక్తమైనా దాని ప్రభావం వసూళ్ల మీద పడలేదు. ఇక..ఈ చిత్రం ఇంత పెద్ద హిట్‌ కావటంపై చిత్ర దర్శకుడు రాజు హిరానీ ఆనందం వ్యక్తం చేశారు. తమ సినిమాకు కథే హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో హిర్వానీ, ఆమిర్‌ఖాన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్‌' సినిమా కూడా ఘనవిజయం సాధించింది. త్వరలోనే ఈ సినిమా 600 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సులభంగా అధిగమిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.