కరెన్సీకట్టలతో ప్రజల పరుగు..

Posted On:08-01-2015
No.Of Views:330

నిత్యం ఏదో ఒక సంచలన వార్తతో కలకలం రేపుతున్న తమిళనాడులో మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన కారులో కట్టలు కట్టల కరెన్సీ బైటపడింది. ఆ సొమ్మును సుమారు రూ.3 కోట్లుగా అంచనావేశారు. ఇది హవాలా సొమ్మా లేక తీవ్రవాదుల కోసం చేరవేస్తున్నదా అనే అనుమానాలు రేకెత్తాయి.రాష్ట్రం గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా తయారైంది. తీవ్రవాదులు, మావోయిస్టుల కదలికలు పోలీస్ శాఖకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఏ వైపు నుంచి ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తారోనని సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రతి మనిషిని, ప్రతి వాహనాన్ని సందేహించేంతగా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆదాయపు పన్ను, పోలీసు అధికారులనే కలవరపాటు గురిచేసే స్థాయిలో కరె న్సీ బయటపడింది. కోయంబత్తూరు సమీపం సేలం-కొచ్చి జాతీయ రహదారిలో పోడిపాళయం అనే గ్రామం వద్ద బుధవారం ఉదయం ఒక ఇన్నోవాకారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీ కొన్నాయి. కారు ముందు భాగం పూర్తిగా నలిగిపోగా ఆ వాహన డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యూరు. ప్రమాదం కారణంగా కారు తలుపులు తెరుచుకోగా అందులో నుంచి రూ.500 నోట్ల కట్టలు చెల్లాచెదరుగా పడ్డారుు. ఈ కరెన్సీని చూసిన బస్సు డ్రైవర్, ప్రయాణికులు కంగారుపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కారును సోదా చేయడం ప్రారంభించారు. కారు తలుపుల్లో, సీటులో స్పాంజికి బదులుగా, లగేజీ పెట్టుకునేచోట కరెన్సీ కట్టలు దొరికాయి. పోలీసులు వెంటనే ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.కోవై నుంచి అక్కడికి చేరుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రూ.500 నోట్ల కట్టలు 490 ఉన్నట్లు తేలింది. అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం కరెన్సీ విలువ రూ.2.55 కోట్లుగా నిర్ధారించారు. కారులోని ప్రయాణికులను విచారించగా, కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా మాలత్తూరుకు చెందిన జలీల్ (40), కొట్టాయంకు చెందిన జాఫర్, కోళికోట్టైకి చెందిన యాసర్ అబూబకర్ (డ్రైవర్)గా తెలుసుకున్నారు. ఈరోడ్ జిల్లాలో రైల్వే కేటరింగ్ నడుపుతున్న ముస్తఫర్ తమకు ఈ నగదును ఇచ్చి అతని సొంతూరైన మలప్పురం చేర్చాలని చెప్పినట్లు కారులోని క్షతగాత్రులు తెలిపారు. మొత్తం ఎంత నగదు ఇచ్చాడో కూడా తెలియదన్నారు. వీరిచ్చిన సమాచారంతో నగదు అందజేసిన ముస్తఫా కోసం ఆదాయపు పన్ను అధికారులు ఈరోడ్‌కు బయలుదేరారు.
 కరెన్సీకట్టలతో ప్రజల పరుగు..జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన కారులో కరెన్సీకట్టలు ఉన్నాయని తెలుసుకున్న ప్రజలు రోడ్డుపైకి పరుగులు పెట్టారు. కారు పరిసరాల్లో చెల్లాచెదరుగా పడి ఉన్న కరెన్సీ కట్టలను కొందరు తమ జేబుల నిండా కుక్కుకున్నారు. మహిళలు తమ పైట కొంగులో వేసుకుని పరుగు లంకించుకున్నారు. మరికొందరు సంచులు తెచ్చుకుని కరెన్సీ కట్టలు నింపుకున్నారు. ఈ సమాచారం పరిసరాలకు పాకడంతో ఆటోల్లో కొందరు అక్కడికి చేరుకున్నారు. అందినంత పుచ్చుకుని ఉడాయించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, అందులోని ప్రయాణికులు చూస్తుండిపోయారు. అధికారులు అక్కడికి చేరుకున్న తరువాత జరిగిన విషయాన్ని కారు ప్రయాణికుడు జలీల్ పోలీసులకు చెప్పాడు.