ఇన్ఫీ ఐఫోన్ 6, హెచ్‌సిఎల్ కార్లు

Posted On:09-01-2015
No.Of Views:303

 దేశంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమకు అత్యధిక లాభాలు తెచ్చిపెడుతున్న తమ ఉద్యోగులకు బహుమతులు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పటికే హెచ్‌సిఎల్ తమ ఉద్యోగులకు భారీ కానుకలు ప్రకటించగా.. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ కూడా అదే బాటలో నడిస్తోంది. హెచ్‌సిఎల్ తమ 130మంది ఉద్యోగులకు మెర్సిడెజ్ కార్లను కానుకలుగా ఇచ్చేసింది. కాగా, ఇప్పుడు ఇన్ఫోసిస్ సంస్థ తమ ఉద్యోగులకు ఐఫోన్ 6 ఎస్‌ను బహుమతులుగా ఇచ్చింది. అత్యుత్తమ పని తీరు కనబర్చిన టాప్ 3000మంది ఉద్యోగులకు ఆ సంస్థ సిఈఓ విశాల్ సిక్కా హాలిడే బోనస్ ఇచ్చారు. ఐఫోన్ 6ఎస్ తోపాటు ఓ ఈమెయిల్‌ను ఉద్యోగులకు పంపారు. ‘నిరుడు సంతోషకరంగా ముగిసింది. ప్రస్తుతం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. సంస్థ సాధించిన విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు.. ఇది వేడుక చేసుకోవాల్సిన సమయం' అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులను ఆయన స్నేహితులుగా సంబోధించారు. ‘ఇన్ఫోసిస్ సాధించిన విజయానికి మీ సమర్థత, మీరు పనిలో చూపిన నైపుణ్యత కారణం' అని అన్నారు. అందుకే ఉద్యోగులకు బహుమతులు ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. హాలిడే బోనస్‌పై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇలా బహుమతులు ఇచ్చిన సందర్భాలు లేవని అన్నారు. మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం రూ. 3,250 కోట్లు ఇన్ఫోసిస్ మూడో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. మూడో త్రైమాసికంలో రూ. 3,250 కోట్ల నికరలాభం ఆర్జించినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. నికర ఆదాయం రూ. 13,796 కోట్లుగా వెల్లడించింది. ఇన్ఫోసిస్ నికర ఆదాయం 5.19 శాతం పెరగడంతో స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు 6శాతం పెరిగాయి.