తప్పించుకున్న మావో అగ్రనేతలు

Posted On:11-01-2015
No.Of Views:336

చిత్రకొండ(ఆంధ్రా`ఒడిషా సరిహద్దుప్రాంతం) వద్ద మావోయిస్టు అగ్రనేత  ముప్పాళ్ల లక్ష్మణరావు పోలీసులు చుట్టుముట్టిన సందర్భంలో చిటికెలో తప్పించుకొని మాయమైనట్లు వినపడుతుంది. సరిహద్దులోని దంతెవాడ వద్ద పోలీసులు కూంబింగ్‌ జరుపుతున్న సందర్భంలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతితో పాటు మిలిటరీ చీఫ్‌ నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బసవరావు చిక్కుబడిపోయారని ఒక కథనం వినిపిస్తోంది. దంతెవాడ ప్రాంతంలో వీరుండగా ఒడిషా సెక్యూరిటీ అధికారి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా విశాఖపట్నంకు పొరుగునే ఉంది. అక్కడ మావోయిస్టులు తరచూ సమావేశమవుతున్నారనే సమాచారం సర్కార్‌కు అందింది. దాంతో మల్కన్‌గిరి,కోరాపుట్‌ జిల్లాల్లో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంలో ముప్పేటలా జరుగుతున్న గాలింపుల్లో మావో అగ్రనేతలు చిక్కుబడిపోయారని, అయితే వీరు,భద్రతాదళాలను ఏమార్చి, అక్కడి నుండి మాయమైనట్లు ఇంటలిజెన్స్‌ వర్గాల కథనం. దాంతో అప్రమత్తమైన బిఎస్‌ఎఫ్‌,ఎస్‌ఓజి,డివిఎఫ్‌ తదితర దళాలు రామగిరి,గుప్తేశ్వర్‌,బోయిపరిగూడ,లామత్‌పేట తదితర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. వీరు ఎక్కువ దూరం వెళ్లి ఉండరని భద్రతా దళాలు భావిస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యమున్న ఈ ప్రాంతంలో అగ్రనేతలు చిక్కడం కష్టమే.అందుకే పోలీసులు గణపతిని పట్టుకుంటే కోటిన్నర నజరానా ఇస్తామని పోస్టర్లు అంటిస్తూ ప్రచారం చేస్తున్నారు.