ఆటంకపరిచేవారికి పతాక శీర్షికల్లో చోటు వద్దు: వెంకయ్య

Posted On:19-01-2015
No.Of Views:262

వివిధ రూపాల్లో ఆటంకాలు కలిగించేవారికి పత్రికల పతాక శీర్షికల్లో చోటు కల్పించవద్దని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. నిర్మాణాత్మక చర్చల కంటే అవాంతరాలు కల్పించడమే వార్తాంశం అవుతోందని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చుకుని, బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన పాత్రను పత్రికలు పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. . 'ఫలానా నేత పార్లమెంటుకు వచ్చి సభను జరగనీయకుండా అడ్డుకున్నారంటూ పత్రికల మొదటి పేజీల్లో ప్రముఖంగా రాస్తుంటారు. అదో గొప్ప పని అన్నట్లుగా చూపిస్తుంటారు. ఒకరినొకరు హత్య చేసుకుంటే దానిని ప్రముఖంగా చూపించినట్లుగా ఈ వ్యవహారం ఉంది. నిర్మాణాత్మక చర్చలను, అలాంటి ఇతర విషయాలను వార్తలుగా పరిగణించడం లేదు. విచ్ఛిన్నకర, అడ్డుతగిలే విధానాలు మాత్రం పెద్ద వార్తాంశాలు అవుతున్నాయి. సభాపతి స్థానం వద్దకు దూసుకుపోయి అర్థరహితమైన పనులు చేయడం, కాయితాలు చించివేయడం వంటివి ప్రముఖ వార్తలవుతున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలే ఈ వైఖరికి ఉదాహరణ. ఇది ఎవరికీ ఉపయోగపడేది కాదు.' అని వెంకయ్య వివరించారు. స్వచ్ఛభారత్ వంటి సామాజిక అంశాలకు పత్రికలు తగిన ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం అభినందనీయమన్నారు. రాజకీయ నాయకులు, అధికార గణం, సామాజిక నేతల మాదిరిగానే ప్రసార మాధ్యమాలకూ ముఖ్యమైన పాత్ర ఉందని చెప్పారు