దిల్లీ భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ

Posted On:19-01-2015
No.Of Views:356

ఇటీవలే పార్టీలో చేరిన ప్రముఖ సామాజిక కార్యకర్త, తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీని దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భాజపా ప్రకటించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బేడీ నాయకత్వంలోనే ఎదుర్కొంటామని స్పష్టంచేసింది. సోమవారం దిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఈ వివరాలను వెల్లడించారు. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి కిరణ్‌బేడీ పోటీ చేస్తారని తెలిపారు. ఈ నిర్ణయాలను పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా తీసుకుందన్నారు. బేడీ చేరికపై భాజపాలో అసంతృప్తి రగులుతోందన్న వార్తలను ఆయన కొట్టివేశారు. మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌తో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్వాస్వరాజ్ తదితర నేతలు హాజరయ్యారు.