తెలంగాణలో ఎంసెట్ మే 14న

Posted On:19-01-2015
No.Of Views:323

తెలంగాణలో ఎంసెట్ తేదీలు వెల్లడయ్యాయి. మే 14న (గురువారం) జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌తో పాటు మిగిలిన ఉన్నత, వృత్తివిద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష తేదీలనూ సోమవారం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశపరీక్షల నిర్వహణను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగిస్తూ కొద్దిరోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అడిగితే ఏపీకి కూడా సేవలందించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ మేరకు...తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ నెల 8న లేఖ రాసింది.  తెలంగాణలోని కళాశాలల్లో సీట్లు కావాలనుకొనే వారెవరైనా తెలంగాణ నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని గౌరవిస్తూ... ప్రవేశాల్లో 15శాతం ఓపెన్ కోటాను ఏపీ విద్యార్థులకు అలాగే కొనసాగిస్తాం. ఇప్పటికైనా వారు కోరితే ఏపీకి సేవలందించేందుకు సిద్ధం'' అని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కొద్దిరోజుల కిందట ఎంసెట్ (మే 10) సహా వివిధ సెట్ల తేదీలను వెల్లడించింది. తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయించారని తెలంగాణ ఆక్షేపించటం... గవర్నర్, కేంద్రం వద్దకూ పంచాయతీ వెళ్ళటం తెలిసిందే. ఉమ్మడికి తాము సిద్ధమంటూనే రెండు రాష్ట్రాలూ విడివిడిగా తేదీలు ప్రకటించిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు జరిగితే మినహా పరీక్షలు విడిగా జరగటానికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.