క్రమబద్ధీకరణ గడువు పెంపు

Posted On:19-01-2015
No.Of Views:349

తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువు పెంచుతూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. 125 గజాల వరకు (జీవో నెం.58) ఉచిత క్రమబద్ధీకరణకు ఈనెల 31 వరకు గడువు పెంచింది. 125 గజాల కన్నా ఎక్కువున్న నివాస స్థలాల క్రమబద్ధీకరణకు వచ్చే నెల 28 దాకా అవకాశం కల్పించింది. సోమవారం రాత్రి సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. పెంచిన గడువు మేరకు కొత్తగా దరఖాస్తులు తీసుకుంటూనే.. పాతవాటి ఆధారంగా స్థలాల క్రమబద్ధీకరణకు క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యూదవ్, రెవెన్యూ, పురపాలక ముఖ్యకార్యదర్శులు బీఆర్ మీనా, ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు నిర్మల, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని, ఆ తర్వాత ఇతర భూములను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఈ రెండు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్ నగరంలో భూముల క్రమబద్ధీకరణకు క్షేత్రస్థాయిలో పలు సమస్యలు, సందేహాలున్న నేపథ్యంలో త్వరలోనే నగర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చించి.. వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. గడువు పెంపుపై సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. నిర్మాణ స్థలాల క్రమబద్ధీకరణకు గతంలో నిర్ణయించిన గడువు సోమవారంతో ముగిసింది. మార్గదర్శకాల జారీలో జాప్యం, ఇంకా చాలా చోట్ల పెద్దఎత్తున దరఖాస్తులు వస్తుండడం, కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంది.