వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

Posted On:20-01-2015
No.Of Views:305

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి 
 తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. మెదక్ జిల్లా కొండపాక శివారులోని రాజీవ్ రహదారిపై టాటా వింగర్ వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వాహనంలోనే ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను 108 సిబ్బంది సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతులు కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
ఆగివున్న లారీని ఢీకొన్న కారు: ఇద్దరి మృతి 
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభుద్రాపురం కూడలి వద్ద 16వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. సుభద్రాపురం కూడలి వద్ద ఆగివున్న లారీని విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన నలుగురిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.