టీ కాంగ్రెస్‌ నేతలను మందలించిన దిగ్విజయ్‌ సింగ్‌

Posted On:20-01-2015
No.Of Views:349

తెలంగాణ కాంగ్రెస్‌ మేథో మథన సదస్సును మంగళవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్ర నేతలకు దిగ్విజయ్‌ క్లాస్‌ తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోయారని నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు విభేదాలు వదిలి, కలిసి కట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌పై దూకుడు పెంచాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో దిగ్విజయ్‌ సింగ్‌ నేతలకు సూచించారు. రానున్న జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నాయకులదేనని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు.సమావేశం అనంతరం దిగ్విజయ్‌ మాట్లాడుతూ ఢిల్లీలో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్ధులు కరువయ్యారని వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే కిరణ్‌ బేడీని బీజేపీలోకి చేర్చుకున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డీ. శ్రీనివాస్‌, జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, షబ్బీర్‌ అలీ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.