సర్కారుకు నిర్లక్ష్యపు ‘వైరస్‌’

Posted On:21-01-2015
No.Of Views:332

ఒక నిర్లక్ష్యం ఖరీదు 19 నిండు ప్రాణాలు. విధి నిర్వహణలో వైద్య విద్యార్థికి సైతం  స్వైన్‌ఫ్లూ వైరస్‌ మహమ్మారి పట్టుకుంది. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలో...
 ఎవరి నిర్లక్ష్యమని నిందించాలో.. ఎవర్ని తప్పుబట్టాలో అర్థం కాని పరిస్థితి. పశ్చిమ దేశాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ మన రాష్ట్రం నింపాదిగా ఉన్నందుకు ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాం. విదేశాల నుండి వచ్చిన విమాన ప్రయాణికుల నుంచే ఇది సోకుతుందని తెలిసినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాంతక వ్యాధి, ఇప్పుడు నగర ప్రజల్ని వణికిస్తోంది. 
 స్వైన్‌ఫ్లూ విస్తరిస్తున్న సమయంలో విదేశాల్లోని విమానాశ్రాయాల్లో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనుమానమున్న వారికి పరీక్షలు జరిపి, వైరస్‌ భారి నుండి బయటపడ్డారు.  కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ బాధితులు వచ్చినా, తీవ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నా నిఘానేత్రం నిద్దుర పోతూనే ఉంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, విమాన ప్రయాణికులకు పరీక్షలు జరిపినట్లయితే ఈ వైరస్‌ వ్యాప్తి జరిగి ఉండేదే కాదు. ఇప్పుడు రెండు పదుల మృతుల సంఖ్య దాటుతున్నా సర్కారులో చలనం లేదు. 
 ప్రజలు భయాందోళనలు చెందుతుంటే వైద్య శాఖ మంత్రిలో ఏ మాత్రం చలనం కనిపించడం లేదు. చివరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి,స్వైన్‌ఫ్లూ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇది వ్యాధి కాదని, వైరస్‌ అని అంతగా భయపడాల్సిందేమీ లేదని ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు. ప్రజలకు కావాల్సింది భరోసా కాదు. వైరస్‌ను అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు.
 వాతావరణంలో ఉష్ణ్రోగ్రతలు తగ్గిపోతున్నందు వల్లే స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా వైద్య శాఖ ఎందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి హెచ్చరిస్తే అప్పుడు వైద్యశాఖ పరుగులు పెడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్‌ జాగ్రత్త పడాలి. ఏ మాత్రం అనుమానమున్న వారిని పరీక్షించి, స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలితే, వెంటనే చికిత్సలు జరిపించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలను ప్రచారంలోకి తీసుకురావాలి. ప్రతి ఆసుపత్రిలో మందులు, డాక్టర్లను అందుబాటులో ఉంచితే కొంత ప్రయోజనం ఉంటుంది.