శ్రీశైలం, సాగర్‌ నిర్వహణ బోర్డుకు అప్పగించాలి

Posted On:28-01-2015
No.Of Views:306

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోండి. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు అప్పగించండి. బోర్డు ద్వారానే ప్రాజెక్టులను నిర్వహించండి’’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర విభజన చట్టాన్ని తెలంగాణ సర్కారు ఉల్లంఘిస్తోందని, దీనివల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లుతోందని తెలిపింది. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఏకే బిష్ణోయికి ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి మొదలుకొని నుంచి తాజాగా నాగార్జున సాగర్‌లో కుడివైపు రెగ్యులేటర్‌ చాంబర్‌కు తాళం వేయడం వరకు... కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య పలు సందర్భాల్లో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు రాష్ట్రాలు లేఖాస్త్రాలు సంధించుకున్నాయి. ఒకరాష్ట్రంపై మరొక రాష్ట్రం ఫిర్యాదులూ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో... రెండు ప్రాజెక్టులను కృష్ణా బోర్డు స్వయంగా నిర్వహించాలంటూ ఏపీ సర్కారు లేఖ రాయడం గమనార్హం. విభజన చట్టం ప్రకారం ఈ దిశగా చర్యలు చేపట్టాలంటూ ఆ లేఖలో కోరారు. ‘‘రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కేంద్రం తక్షణమే తన పరిధిలోకి తీసుకోవాలి. వాటి నిర్వహణబాధ్యతను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగిస్తూ సత్వరం నోటిఫికేషన్‌ జారీ చేయాలి’’ అని ఆదిత్యనాథ్‌ దాస్‌ కోరారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణను బోర్డే చేపట్టాలని విభజన చట్టం చెబుతోందని ఆయన గుర్తు చేశారు. ‘‘కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ మాకు న్యాయం జరగడంలేదు. కృష్ణా బోర్డు సూచనలను తెలంగాణ సర్కారు ఖాతరు చేయడంలేదు. బోర్డుకు విభజన చట్టంలో పేర్కొన్న విధులను ఇప్పటికీ అప్పగించలేదు. అధికారాలనూ అప్పగించలేదు. బోర్డుకు పూర్తిస్థాయి అధికారాలు ఉంటేనే ఉల్లంఘనలను అడ్డుకోగలదు. ఎవరు తప్పుచేసినా నియంత్రించగలదు.’’ అని ఆ లేఖలో పేర్కొనట్లు తెలిసింది.