ఆమ్‌ ఆద్మీ వైపు మొగ్గు:నీల్సన్‌ సర్వేలో వెల్లడి

Posted On:28-01-2015
No.Of Views:300

ఢిల్లీ ఓటర్లు  ఆప్‌కే ఓటేస్తామని చెప్పారు ముందస్తు ఎన్నికల సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది ఆప్‌కే ఓటేస్తామని చెప్పారు. కిరణ్‌ బేదీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల రెండో వారంలో నిర్వహించిన సర్వేలో కంటే... తాజా సర్వేలో ఆప్‌కు నాలుగు శాతం ప్రజల మద్దతు పెరగడం విశేషం. సీఎం అభ్యర్థిపైనా ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కే ఎక్కువ మద్దతు లభించింది. కేజ్రీవాల్‌కు 51 శాతం ప్రజల మద్దతు ఉండగా... కిరణ్‌బేదీకి 40 శాతం, అజయ్‌ మాకెన్‌ (కాంగ్రెస్‌)కు 8 శాతం ప్రజల మద్దతు లభించింది. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ప్రధానంగా కేజ్రీవాల్‌కు అండగా ఉన్నారు. ఆదాయవర్గాల వారీగా చెప్పాంటే... అల్పాదాయ వర్గాల వారు ఆప్‌కు, అధిక ఆదాయ (నెలకు రూ.25 వేల పైన) వర్గాల ప్రజలు బీజేపీకి సపోర్టు చేశారు. బీజేపీకి మద్దతు తెలిపిన వారిలో చాలా మంది... కేంద్రంలో మోదీకి మద్దతు ఇవ్వడానికే బీజేపీని బలపరుస్తున్నామని చెప్పారు. కేజ్రీవాల్‌ సభలకు దీటుగా కిరణ్‌ బేదీ సభలకు ప్రజలు రాకపోవడంపై బీజేపీలో ఆందోళన నెలకొంది. కిరణ్‌ బేదీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఢిల్లీ బీజేపీ సీనియర్లలో అసంతృప్తి నెలకొందని, అందుకే ఆమెకు మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో, బీజేపీ పెద్ద తలలు ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికలు ఉండడంతో ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీ, మరో 11 మంది కేంద్ర మంత్రులు, 17 మంది సీనియర్‌ ఎంపీలు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు.