రూ.305 కోట్లతో వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి

Posted On:28-01-2015
No.Of Views:327

 ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.305 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు యూనివర్సిటీ ప్రత్యేక అధికారి, ఇన్‌చార్జ్‌ వైస్‌చాన్సలర్‌ ప్రవీణ్‌ పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయకళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ యూనివర్సిటీ అభివృద్ధి, అనుబంధ పరిశోధనల కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు వెచ్చిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో వ్యవసాయ యూనివర్సీటీ విభజన అన్ని విభాగాల్లో పూర్తి అయ్యిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలను నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం పరిశోధనలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. దీనికోసం ప్రత్యేకించి టాస్క్‌పోర్స్‌ కమిటీని నియమించిందన్నారు. వరిసాగులో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరిశోధనలు జరపనున్నామన్నారు. 18-34 ఏళ్ల మధ్య వున్న రైతులను ఎంపిక చేసి వారికి వ్యవసాయ పద్దతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.