చిన్నారిని చిదిమేశారు

Posted On:31-01-2015
No.Of Views:336

ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి అనంతరం నీళ్ల ట్యాంకులో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్లూరు మండలం ఎర్రబోయిన పల్లికి చెందిన నాగేశ్వరరావు మణుగూరులోని సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.ఆయన కొడుకు సుమన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్నారు. కాగా, సుమన్ అయిదేళ్ల క్రితం ఆగ్రాకు చెందిన నిధిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సుమన్ హైదరాబాద్‌లోనే ఉండి చదువుకుంటుండగా నిధి మాత్రం అత్తమామలతో కలిసి కల్లూరులో నివసిస్తుంది. అయితే గురువారం అర్థరాత్రి  తరువాత తన మంచంపై ఉన్న చిన్న కుమార్తె కనిపించకపోవడంతో గమనించిన నిధి... తన  అత్తమామలకు ఆ విషయం తెలిపింది.దీంతో అందరూ కలసి రాత్రంతా చిన్నారి కోసం వెతికారు. ఆ క్రమంలో శుక్రవారం ఉదయం డాబాపైన ఉన్న నీళ్ల ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నాగేశ్వరరావు దంపతులను పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించిన చిన్నారి తల్లి మాత్రం ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. భర్త హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాతే  అన్ని విషయాలు చెబుతానంటోంది. కాగా, అత్తమామలు, కోడలికి మధ్య సఖ్యత లేదని స్థానికులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు.