మళ్లీ నెత్తురోడిన పాక్

Posted On:31-01-2015
No.Of Views:342

కరాచీ: పాకిస్తాన్ మరోసారి ఉగ్ర దాడికి నెత్తురోడింది. సింధ్ ప్రావిన్సులోని షికార్‌పూర్‌లో ఉన్న షియా మసీదైన ఇమామ్‌బర్గాలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సందర్భంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు చిన్నారులు సహా 49 మంది మృత్యువాతపడగా మరో 55 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి తాత్కాలిక భవనంలో ఉన్న మసీదు పైకప్పు కుప్పకూలడంతో చాలా మంది ముస్లింలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే అక్కడకు చేరుకున్న వందలాది మంది స్థానికులు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకూ వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రార్థనల సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రిమోట్ ద్వారా పేలుడు జరిపినట్లు పోలీసులు పేర్కొనగా ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండొచ్చని మీడియా అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జున్‌దుల్లా మిలిటెంట్ గ్రూపు ప్రకటించుకుంది. షియాలు తమ శత్రువులని...అందుకే దాడికి పాల్పడినట్లు తెలిపింది. గత ఏడాది తాలిబాన్ నుంచి వేరుపడిన జున్‌దుల్లా మిలిటెంట్ గ్రూపు తాజాగా ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపునకు విధేయత ప్రకటించింది. గత ఏడాది జనవరి 22న ఇరాన్ నుంచి 24 మంది షియా యాత్రికులతో తిరిగి వస్తున్న బస్సుపై బలూచిస్తాన్‌లో జరిగిన బాంబు దాడి తర్వాత షియాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించారు.